స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇండియన్ క్యాంపసెస్ అంశంపై అవగాహన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆధునిక విద్యారంగం విద్యార్థుల నైపుణ్యాలకు మెరుగుగులు దిద్దడంతోపాటు, ఉపాధికి మార్గం చూపేదిగా ఉండాల్సిన అవసరముందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ వి.సి. కాన్ఫరెన్స్ హాలులో ఈరోజు స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇండియన్ క్యాంపసెస్ అనే అంశంపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రసంగించిన అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ప్రసాద్ మావులూరి భారతదేశంలోని వివిధ ఉన్నత విద్యాసంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తమ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తోందన్నారు. ప్రతిసంవత్సరం విద్యాసంస్థలనుండి పట్టాలు తీసుకొని బయటకు వస్తున్న విద్యార్థుల్లో 80% మందికి తగిన నైపుణ్యాలు లేకపోవడంతో పారిశ్రామిక అవసరాలకు తగినంత మంది అభ్యర్థులు దొరకడం లేదన్నారు. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లోకూడా చాలామంది విద్యార్థులు వెనుకబడుతున్నారన్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే మొదటి సెమిస్టర్ నుండే తగిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన జరగాలన్నారు. తాము అందించే కోర్సులకు అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తో పాటు భారతదేశంలోని ఏఐసిటిఈ గుర్తింపు ఉందన్నారు. అమెరికాకు చెందిన డేటా మేగ్నమ్ లాంటి సంస్థల సహకారంతో తాము జారీచేసే ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లు విద్యార్థులకు ప్లేస్ మెంట్లు సాధించడంలో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన విభాగాల్లోకూడా తమసహకారం యూనివర్సటీకి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ కుమార్ నాయుడు, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య పి.వి. సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి. వి. కృష్ణారెడ్డి, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ తో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

