టిడ్కో గృహాలను అన్ని విధాలుగా సిద్ధం చేసి లబ్ధిదారులకు అందిస్తున్నాం
1 min read
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టి. జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: టిడ్కో గృహాలను అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలతో సిద్ధం చేసి లబ్ధిదారులకు అందిస్తున్నాం అని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.మంగళవారం కర్నూలు నగర శివారులో జగన్నాథ గట్టు వద్ద టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ పాల్గొని 95 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను,మెగా కీ ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…టిడ్కో గృహాలను అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలతో సిద్ధం చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి నెలలో మరో 500 మందికి టిడ్కో గృహాలను అందజేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. టిడ్కో సముదాయం వద్ద విద్యుత్, త్రాగునీరు, ఏర్పాటు చేశామని, త్వరలో బస్సు సౌకర్యం, పోలీస్ భద్రత వంటి అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. గృహాలు పొందిన లబ్ధిదారులు వెంటనే అక్కడ నివాసం ప్రారంభించాలని, అలా నివాసం ఉంటే మరింత మంది ప్రజలు ముందుకు వచ్చి అక్కడ స్థిరపడేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వంలోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని, గత ప్రభుత్వం టిడ్కో గృహాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. టిడ్కో గృహాల సమీపంలోనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ ఉండటంతో, ఈ ప్రాంత వాసులకు రానున్న రోజుల్లో విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. అలాగే టిడ్కో గృహాల ఎదురుగా స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని, రాబోయే కాలంలో ఈ టిడ్కో ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే టిడ్కో గృహాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కర్నూల్ మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణా మూర్తి, టిడ్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ శేష సాయి, తదితరులు పాల్గొన్నారు.

