జర్నలిజం.. సేవలకు గుర్తింపు
1 min read

సీనియర్ జర్నలిస్టు సాయి కుమార్ కు ఘన సన్మానం
- గుర్తింపు..బాధ్యతను పెంచిందని వెల్లడి..
కర్నూలు, న్యూస్ నేడు : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్‌లో నిర్వహించిన మహా సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179 వర్ధంతి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రభ బ్యూరో రిపోర్టర్ ఎం. సాయి కుమార్ నాయుడుకి ఘన సత్కారం నిర్వహించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో నిష్పాక్షికంగా, సమాజ బాధ్యతతో సేవలందిస్తున్నందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమితి సభ్యులు ఆయనను ప్రత్యేక పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి విశిష్ట అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, “సమాజంలో జరుగుతున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చి, ప్రజల వాణిని అధికారులకు చేరవేసే వంతెన పాత్రను జర్నలిస్టులు పోషిస్తారు. ఆ బాధ్యతను ఎం. సాయి కుమార్ నాయుడు నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. సమితి సభ్యులు పేర్కొన్నట్లుగా, గ్రామీణ సమస్యలు, రైతు ఆవేదనలు, సామాజిక అన్యాయాలు, చారిత్రక అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించడంలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను వెలుగులోకి తీసుకురావడంలోనూ, రాయలసీమ గర్వకారణమైన వ్యక్తుల గురించి ప్రజలకు తెలియజేయడంలోనూ ఆయన కృషి ప్రస్తావనీయమని అభిప్రాయపడ్డారు. సత్కార స్వీకరణ అనంతరం ఎం. సాయి కుమార్ నాయుడు మాట్లాడుతూ, “జర్నలిజం నాకు వృత్తి మాత్రమే కాదు, సామాజిక బాధ్యత. సమాజానికి ఉపయోగపడే కథనాలు రాయడం నా కర్తవ్యంగా భావిస్తాను. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రస్తుత కాలంలో వేగవంతమైన సమాచార యుగంలో జర్నలిజం పాత్ర మరింత విస్తరించింది. వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు అందించడం, సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, చారిత్రక వారసత్వాన్ని కాపాడడం వంటి బాధ్యతలను సీనియర్ జర్నలిస్టులు సమర్థంగా నిర్వహించినట్టు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ప్రజలకు గుర్తు చేస్తూ, సమాజ సేవలో భాగస్వాములైన వ్యక్తులను సత్కరించడం ద్వారా సమితి మంచి సందేశాన్ని ఇచ్చిందని సభలో పలువురు అభిప్రాయపడ్డారు.

