NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్చి 15న జరిగే FLNA పరీక్షను విజయవంతంగా నిర్వహించాలి

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా 

నంద్యాల, న్యూస్​ నేడు: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్చి 15న నిర్వహించబడనున్న “ప్రాధమిక చదువు మరియు సంఖ్యా నైపుణ్యాల అంచనా పరీక్ష” (Foundational Literacy and Numeracy Assessment)ను జిల్లావ్యాప్తంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష  నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,62,235 మంది అభ్యాసకులను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసినట్లు తెలిపారు. వీరి కోసం జిల్లాలో 1,368 పరీక్షా కేంద్రాలను గుర్తించగా, ప్రాథమిక పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా అంగన్వాడీ టీచర్లు మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. ఈ పరీక్ష మార్చి 15న ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించబడుతుందని, అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సదుపాయం, శానిటేషన్ వంటి మౌలిక వసతులను తప్పనిసరిగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొదుపు సంఘాలు, శ్రామిక సంఘాల ద్వారా ప్రతి అభ్యసకునికి పరీక్షపై విస్తృతంగా అవగాహన కల్పించి, అందరూ తప్పనిసరిగా పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు, ఏపీఎంలు మరియు ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.పీడీ, మెప్మా పీడీ, ఐసీడీఎస్ పీడీ, డీఈఓ, డిప్యూటీ సీఈఓ, డీపీఓ, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు మరియు వయోజన విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

About Author