అమరజీవి త్యాగం – యువతకు స్ఫూర్తి
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్పూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మార్చి 16, 1901న జన్మించారన్నారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మద్రాసులో జరిగిందన్నారు.ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, సుమారు నాలుగేళ్ల పాటు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో ఉద్యోగం చేశారన్నారు. 1922లో తన బిడ్డ మరియు భార్య చనిపోయిన తర్వాత, ఆయన తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేశారన్నారు. గాంధీజీ బోధనలకు ప్రభావితులై సబర్మతి ఆశ్రమంలో చేరారన్నారు. ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమం వంటి స్వాతంత్ర్య పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారన్నారు. దళితుల హక్కులు మరియు దేవాలయ ప్రవేశం కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఖాదీ ప్రచారం మరియు పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారన్నారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 1952లో చెన్నై లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. 58 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత, డిసెంబర్ 15, 1952న ఆయన అమరులయ్యారన్నారు. ప్రస్తుత యువత పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దేశం మనకేమి ఇచ్చింది అన్నదాని కంటే, మనం దేశానికి ఏమి చేయగలం అని ఆలోచించాలని, సోషల్ మీడియా వంటి వ్యాపకాలలో పడి జీవితాన్ని వృధా చేసుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు.
అనంతరం
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీ రాములు నామస్మరణం చేయాల్సిందే అన్నారు. ఎందుకంటే అంతటి గొప్ప త్యాగాన్ని చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఆయన తన ప్రాణాన్నే అర్పించి రాష్ట్రం కోసం నిలబడిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరం ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు ని గౌరవిస్తూ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు. అనంతరం జిల్లాలో పొట్టి శ్రీరాములు కమిటీ తరపున అనేకమైన సేవా సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు కమిటీ అధ్యక్షులు శేషగిరి శెట్టి, డాక్టర్ రంగయ్య లలితా సంఘం జ్ఞానేశ్వర్ అమ్మ అవొపా రత్న ప్రసాద్, మారం నాగరాజు సుబ్బి స్వామి చీమకూరు రాజశేఖర్ గాయత్రి గోశాల రాజ్యలక్ష్మి పెరుమాళ్ళ దత్తయ్య ఎన్వి శ్రీనివాసులు రామచంద్రయ్య నందకిషోర్ లను జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి సన్మానం చేశారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్,సెట్కూరు సిఈఓ వేణుగోపాల్, బి సి వెల్ఫేర్ అధికారి ప్రసూన, ఈ.డి జాకీర్ హుస్సేన్, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, ఆర్య వైశ్య సంఘ నాయకులు శేషగిరి శెట్టి, డాక్టర్ రంగయ్య జ్ఞానేశ్వర్ అమ్మ, ఇంజనీరింగ్ కాలేజ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


