అమరావతిని అజరామరం చేశారు
1 min read

ఐదుకోట్ల ఆంధ్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు.
రైతుల త్యాగ ఫలితమే అమరావతి
పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందన్న రాష్ట్రపతి
ఢిల్లీ , న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు దేశ ప్రథమపౌరురాలు సాక్షి సంతకం కావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుకు దేశమంతా ఒక్కటై మద్దతు ఇవ్వగా, రాజముద్ర వేసి అమరావతికి శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజేలు పలుకుతున్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-మా రాజధాని అమరావతి అని ఆంధ్రజాతి సగర్వంగా తల ఎత్తి చాటేలా చారిత్రక అమరావతి రాజధాని చట్టంపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రప్రతి భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. విభజనతో కోలుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తించి.. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ చట్టం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముగారికి ఆంధ్రజాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరావతి చరిత్ర-సంస్కృతి-రాజధానిలో పూర్తయిన నిర్మాణాలు, రైతుల ఉద్యమం, మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణాలు పూర్తయితే అమరావతి రాజధాని ఎలా ఉంటుందో సూచించే ఊహాచిత్రాలు, పర్యావరణహిత నిర్మాణ విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీలతో కలిసి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరావతి కి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీ, 2024 లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి పనులు పునః ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్రపతికి వివరించారు.
రైతుల త్యాగ ఫలితమే అమరావతి
రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబు పిలుపుతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములు రైతులు త్యాగం చేశారని, గత పాలనలో వారిపై దాడులు జరిగినా, అక్రమ కేసులు పెట్టినా, శాంతియుతంగా రాజధాని కోసం ఉద్యమించారని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. కోట్లాది ప్రజల కోరిక అయిన అమరావతి చట్టం తన హయాంలో రూపొందడం సంతోషంగా ఉందని, రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణం కోసం తమ భూమిని ఇచ్చారని రాష్ట్రపతి రైతుల త్యాగాలను కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధాని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని, రాజధాని పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.


