వీరశైవులకు అండగా ఉంటా.. మంత్రి టీజీ భరత్ గుప్తా
1 min read

బసవేశ్వర సర్కిల్ ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: వీరశైవులకు అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పారు. కర్నూలులోని శ్రీరామ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వర సర్కిల్ ను ఆయన ప్రారంబించారు. అనంతరం శ్రీరామ థియేటర్ లో నిర్వహించిన వీరశైవుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ వీరశైవులు అడిగిన వెంటనే ఈ సర్కిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన పరిధిలో ఉన్న పనులు చక చకా చేసేందుకు వీలు ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. వీరశైవుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కర్నూలులో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. అవుట్ డోర్ స్టేడియంలో రెండున్నర కోట్ల రూపాయలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రజా రాజధాని అమరావతి విషయంలో జగన్ కు మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదన్నారు. అన్ని పార్టీలు అమరావతికి మద్దతిస్తే.. జగన్ మాత్రం మావిగన్ అంటున్నారన్నారు. ఇలాంటి ఆలోచనా విధానం వలనే 11 సీట్లకు పడిపోయారన్నారు. బసవ భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సహకారం అందిస్తానని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సాధికార సమితి స్టేట్ కన్వీనర్ శివరాజ్, వీరశైవ ఐక్యవేదిక అధ్యక్షుడు మల్లికార్జునప్ప, సెక్రెటరీ చంద్రశేఖరప్ప, వీరశైవ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న, మాజీ చైర్మన్ రుద్ర గౌడ్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టిడిపి నగర అధ్యక్షుడు రవి, తదితరులు పాల్గొన్నారు.


