NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోని మున్సిపాలిటీకి మహర్దశ: రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

1 min read

ఆదోని, న్యూస్ టుడే: ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాల ముఖచిత్రాన్ని మార్చేలా ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీలలో రూ.11,360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.ఇందులో భాగంగా ఆదోని మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నిధులు మంజూరు కావడం విశేషం. ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 161 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆదోని మున్సిపాలిటీకి ఒకేసారి రూ.50 కోట్లు మంజూరు కావడం ఇదే తొలిసారని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంజూరైన నిధుల్లో రూ.39 కోట్లతో పట్టణంలోని 52 వార్డుల్లో కొత్త సిసి రోడ్ల నిర్మాణం, మిగిలిన రూ.11 కోట్లతో ప్రజల వినోదం, ఆహ్లాదం కోసం 13 నూతన పార్కుల అభివృద్ధి చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే తాగునీటి ఎద్దడి నివారణకు మరొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు కొనసాగుతున్నాయని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, రోడ్ల విస్తరణ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.   పట్టణాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసి ఆదోనిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, భాస్కర్ రెడ్డి, విట్టా రమేష్, రంగస్వామి, తిమ్మప్ప, రామచంద్ర, జనసేన పట్టణ అధ్యక్షులు రేణు వర్మ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *