రబీ (దాళ్వా) సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి
1 min read
గత ధాన్యం కొనుగోలులో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి, రబీ ధాన్యం కొనుగోలులో మంచి లక్ష్యాలు సాధించాలి
ఆరుగాలం శ్రమించిన రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా గిట్టుబాటు ధర పొందేలా అవగాహన సదస్సులు నిర్వహించాలి
జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబర్లో బుధవారం రబీ (దాళ్వా) సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ అధ్యక్షతన సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గ్రామస్థాయిలో రైతులందరికీ అవగాహన సదస్సు ద్వారా పూర్తి అవగాహన కల్పించి, ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి అమ్ముకునేలా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సులభతరం అయిందని 7337359375 ఫోను నెంబరు ద్వారా వాట్సప్ గవర్నెన్స్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టరేటులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఫోను నెంబరు 7702003584, టోల్ ఫ్రీ నెంబరు 18004256453 రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కనీస మద్దతు ఏ గ్రేడు ఒక క్వింటాలు రూ 2,389/-లు, 75 కేజీలు రూ 1,792/-లు, 40 కేజీలు రూ 956 లు, సాధారణ రకం ఒక క్వింటాలు రూ 2,369/-లు, 75 కేజీలు రూ 1,777/-లు, 40 కేజీలు రూ 948/- లు మద్దతు ధర కల్పించడం జరిగిందని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు లోబడి ధాన్యం బాగా ఆరబెట్టి శుద్ధి చేసుకుని రైతు సేవా కేంద్రములకు తీసుకువచ్చే విధంగా సంబంధిత శాఖలు అధికారులు రైతులందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.ప్రతి కొనుగోలు కేంద్రంలో తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, క్వాలిటీ గన్ని సంచులు తదితర అవసరమైన సామగ్రి సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అలాగే ధాన్యం నిల్వలు, రవాణా వాహనాలకు జిపిఎస్ సిస్టం ఉండేలా చూడాలని ఆదేశించారు. చెల్లింపులు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చెయ్యాలని, ఎక్కడ ఒక చిన్న ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో వివరాలు, విధానాలు, గిట్టుబాటు ధరలు, పూర్తి సమాచారాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా రైతు సేవా కేంద్రాలలో డిస్ ప్లే చెయ్యాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా పర్యవేక్షణ చెయ్యాలని, రైతు సేవా కేంద్రాలకు వచ్చిన రైతులతో స్నేహభావంతో మెలిగి, లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజరు పి.శివరామ మూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాష, జిల్లా డియస్ వో ఇ.బి. విలియమ్స్, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, డిసివో అరిమిల్లి శ్రీనివాసు, జిల్లా మార్కెటింగు అధికారి యం.డి.వి. శ్రీనివాస రావు, శాస్త్రవేత్త యం.గిరిజారాణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


