నెరణికి వీఏఏల విత్తనాల మోసం వ్యవహారంపై వ్యవసాయ శాఖ విచారణ ప్రారంభం
1 min read
రైతుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిన విచారణ అధికారి – నివేదికను జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారికి పంపనున్నట్లు వెల్లడి
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని నెరణికి, లింగంపల్లి గ్రామ పరిధిలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లుగా (వీఏఏలు) విధులు నిర్వహిస్తున్న ఆర్. పరమేష్ నాయక్, ఎన్. బల్దేవ్ నాయక్ ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు ఇప్పిస్తామని చెప్పి నెరణికి, కొత్తపేట, నెరణికి తండాకు చెందిన రైతుల నుంచి రెండు నెలల క్రితం లక్షల రూపాయలు వసూలు చేసి, విత్తనాలు ఇవ్వకుండా, డబ్బులు కూడా తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారన్న రైతుల ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై వ్యవసాయ శాఖ చేపట్టిన శాఖాపరమైన విచారణలో భాగంగా కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో అగ్రోనమీ విభాగం సహాయ వ్యవసాయ సంచాలకుడు (ఏడీఏ) డి. రాజశేఖర్‌ను విచారణ అధికారిగా నియమించారు.విచారణలో భాగంగా బుధవారం (22-07-2026) డి. రాజశేఖర్, ఆలూరు ఏడీఏ ఎం. చెంగల్రాయుడు, హొళగుంద మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ కలిసి నెరణికి తండా, నెరణికి, కొత్తపేట గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాల పేరుతో డబ్బులు చెల్లించి మోసపోయిన రైతుల నుంచి వివరాలు సేకరించి, వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.ఈ విచారణకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారికి సమర్పిస్తామని విచారణ అధికారి డి. రాజశేఖర్ తెలిపారు. రైతులకు జరిగిన అన్యాయంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.



