సర్పంచ్ పీఠం కోసం కౌతాళం మండలంలో రసవత్తర పోరు!
1 min read
ఎవరి హవా నడుస్తుంది? ఎవరి వ్యూహం ఫలిస్తుంది?
కౌతాళం న్యూస్ నేడు:కౌతాళ మండల కేంద్రమైన కర్నూలు జిల్లాలోనే మంత్రాలయం నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ హాట్ గా ఉండే మండలం కౌతాళం. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలతో మండలం మొత్తం మళ్ళీ వేడెక్కింది.మండల కేంద్రమైన కౌతాళం నుంచి,హల్వి, మొదలు పెడితే ఉప్పరహాల్, ఉరుకుంద, హాలహర్వి, బాదినహాల్,… ఇలా ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు ఒకే చర్చ. “మన గ్రామానికి ఈసారి సర్పంచ్ ఎవరు?”
మండల కేంద్రంలోనే హోరాహోరీ:
కౌతాళం గ్రామం మండలానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ సర్పంచ్ పీఠం అంటేనే ఒక ప్రతిష్ట. అందుకే ఇక్కడ పోటీ ఎప్పుడూ హోరాహోరీగా ఉంటుంది.తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, జనసేన… అన్ని పార్టీలు తమ తమ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. పార్టీ జెండాలు పక్కన పెడితే, వ్యక్తిగత పలుకుబడి, కుటుంబ బలం, యువత మద్దతు… ఇవే ఇక్కడ గెలుపును నిర్ణయిస్తాయని స్థానికులు చెబుతున్నారు.
గ్రామాల్లో అసలు సమస్యలు ఇవే:
కౌతాళం మండలంలో ప్రచారానికి వెళితే అభ్యర్థులకు ఓటర్లు అడుగుతున్న మొదటి ప్రశ్న ఇదే – “మా ఊరికి నీళ్ళు ఎప్పుడు వస్తాయి?”తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం… ఇవే కౌతాళం గ్రామాల్లో ఏళ్ళ తరబడి పరిష్కారం కాని సమస్యలు.
“గత సర్పంచ్ లు చేసింది ఏముంది? రోడ్లు అలాగే ఉన్నాయి, డ్రైనేజీ అలాగే ఉంది” అని ఓటర్లు నిలదీస్తున్నారు. అందుకే ఈసారి అభ్యర్థులు హామీల కంటే, “మేము చేసి చూపిస్తాం” అనే మాటకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
యువ ఓటర్లే కీలకం:
ఈసారి కౌతాళం ఎన్నికల్లో యువ ఓటర్లదే కీలక పాత్ర. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, చాయ్ దుకాణాల దగ్గర యువత చర్చే వేరే లెవెల్ లో ఉంది.
“కులం చూసి కాదు, పని చేసే వాడిని చూసి ఓటు వేస్తాం” అని యువత స్పష్టంగా చెబుతోంది. దీంతో అభ్యర్థులు కూడా యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు వేస్తున్నారు.
స్వతంత్ర అభ్యర్థుల సంచలనం:
కౌతాళం మండలంలో ఈసారి స్వతంత్ర అభ్యర్థుల హవా కూడా బాగా కనిపిస్తోంది. “పార్టీలు మాకు వద్దు, మా ఊరి అభివృద్ధే మాకు ముఖ్యం” అంటూ బరిలోకి దిగిన స్వతంత్రులు ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు.
ఉత్కంఠకు తెర ఎప్పుడు?
మొత్తానికి కౌతాళం మండలంలో ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా లేవు. ప్రతి గ్రామంలోనూ నువ్వా నేనా అనే పోటీ ఉంది.సర్పంచ్ పీఠం ఎవరిని వరిస్తుంది? ఏ పార్టీ జెండా కౌతాళం గ్రామాల్లో ఎగురుతుంది? అన్నది ప్రజాతీర్పు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.కానీ ఒక్కటి మాత్రం పక్కా… ఈసారి కౌతాళం ఓటరు చాలా ఆలోచించి ఓటు వేయబోతున్నాడు. పని చేసే వాడికే పట్టం కట్టబోతున్నాడు.
– కౌతాళం స్పెషల్ ప్రతినిధి, టి. శివ కుమార్


