ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
1 min read
సీఎం చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు
ఢిల్లీలో ఫుడ్ వరల్డ్ ఇండియా కార్యక్రమంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్
ఢిల్లీ, న్యూస్ నేడు: దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్ అన్నారు. ఢిల్లీలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) నిర్వహిస్తున్న ఫుడ్‌వరల్డ్ ఇండియా 2026 యొక్క 17వ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే కేవలం ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదని, సాంకేతికతకు, మేధస్సుకు, సంబంధించిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారత్ ప్రపంచానికి తయారీ కేంద్రంగా ఉందన్నారు. ఇక ప్రపంచ ఆహార శుద్ధి పరిశ్రమ విలువ 8.1 ట్రిలియన్ డాలర్లు అయితే ఇందులో భారతదేశ వాటా 543 బిలియన్ డాలర్లు కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా 49 బిలియన్ డాలర్లు అని తెలిపారు. దేశంలో అత్యధిక సంఖ్యలో నమోదైన ఆహార శుద్ధి పరిశ్రమలను కలిగి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. అందుకే భారతదేశపు ఆహార శుద్ధి పరిశ్రమకు రాజధానిగా ఏపీ ఎదుగుతోందన్నారు. ఏపీలో 1,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, పనిచేస్తున్న ఆరు ఓడరేవులు, ఏడు విమానాశ్రయాలు, 24×7 నాణ్యమైన విద్యుత్ సరఫరా, అద్భుతమైన రవాణా సౌకర్యం, విశాలమైన పారిశ్రామిక భూమి ఉందన్నారు. భారతదేశంలోనే చేపలు మరియు రొయ్యలు అత్యధికంగా ఏపీ నుండే ఉత్పత్తి అవుతాయన్నారు. మిరపకాయలు, నిమ్మకాయలు, కోకో, ఆయిల్ పామ్, బొప్పాయి, గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఏపీ ఉందన్నారు. భారతదేశంలో వరి, మామిడి, అరటి, సుగంధ ద్రవ్యాలు మరియు సముద్ర ఉత్పత్తులను ఉత్పత్తి చేసే అతిపెద్ద ఉత్పత్తిదారులలో రాష్ట్రం ఒకటిగా ఉందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ సరైన రాష్ట్రమని తెలిపారు. రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. యువతకు సైతం ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి టీ.జీ భరత్ వివరించారు. అధికంగా ప్రోత్సాహకాలు అందించడంతో పాటు సింగిల్ డెస్క్ అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ. 30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో తొమ్మిది ఫుడ్ పార్కులు, 17.20 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మరియు 33.52 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగి సామర్థ్యంతో కూడిన ఆధునిక కోల్డ్ స్టోరేజ్ మౌలిక సదుపాయాలు ఏపీలో ఉన్నాయన్నారు. పండ్ల ప్రాసెసింగ్ కేంద్రాలు, రొయ్యల ప్రాసెసింగ్ క్లస్టర్లు, జీడిపప్పు క్లస్టర్లు, సుగంధ ద్రవ్యాల క్లస్టర్లు ఉన్నాయని, ఓడరేవులను పరిశ్రమలతో అనుసంధానించే సమీకృత లాజిస్టిక్స్ కారిడార్లు ఉన్నాయన్నారు. గత రెండు సంవత్సరాలలో దాదాపు రూ.11,800 కోట్ల విలువైన 29 భారీ ఆహార శుద్ధి ప్రాజెక్టులను ఆమోదించినట్లు తెలిపారు.



