PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అనితర’ సాధ్యుడు…డా. చంద్రశేఖరుడు…!

1 min read

శ్రమించాడు… సాధించాడు…

  • సక్సెస్​ఫుల్​ డాక్టర్​గా పేరుగాంచాడు…
  • చదివిన కళాశాలలోనే.. ప్రిన్సిపాల్​గా ఎదిగాడు…
  • కళాశాలను… ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాడు
  • ఎందరికో ఆదర్శం… మరెందరికో స్ఫూర్తి…
  • వేలాది మంది గుండె హృద్రోగులకు… ప్రాణదాతగా నిలిచాడు..
  • వైద్యవిద్యార్థులకు దిక్సూచి…

“పరోపకారం ఇధం శరీరం అన్నారు పెద్దలు. పదుగురికి ఉపకరించని ఈ తనువెందుకు? నలుగురికి శ్రేయస్సుకు  పాటు పడని… ఈ జన్మెందుకు…? అని తన తండ్రి నిత్యం చెప్పేవాడు.  వేలాది మందికి విద్యాదానం చేస్తున్న తన తండ్రి …దాతృత్వ భావనను చిన్ననాటి నుంచే అలవర్చుకున్న డా. పి. చంద్రశేఖర్​… ఎందరికో ఆదర్శంగా… స్ఫూర్తిగా నిలిచారు.  వైద్యరంగంలో అత్యుత్తమ సేవలు అందించి….  వేలాది మంది గుండె హృద్రోగులకు ప్రాణదాతగా నిలిచారు…. సక్సెస్​ఫుల్​ డాక్టర్​గా పేరుగాంచాడు.

పల్లెవెలుగు: కర్నూలు మెడికల్​ కళాశాలలో… ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని తనదైన శైలిలో అభివృద్ధి చేసిన కార్డియాలజిస్ట్​ డా. పి. చంద్రశేఖర్​… రాష్ట్ర గవర్నర్​తోపాటు మరెందరో మన్ననలు చూరగొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన  ఆస్పత్రిలో సూపర్​  స్పెషాలిటీ కార్డియాలజీ  విభాగం, హెచ్​ఓడి, కర్నూలు హార్ట్​ అండ్​ మల్టీ స్పెషాలిటీ సెంటర్​ అధినేత డాక్టర్​  పి. చంద్రశేఖర్​..తన జీవిత విజయ ప్రస్థానంలోని పలు విశేషాల సమాహారం… పల్లెవెలుగు పాఠకులకు…. ప్రత్యేకం….

స్వగతం: 

పూర్తి పేరు: డాక్టర్​ పి. చంద్రశేఖర్​

తల్లిదండ్రులు: లక్ష్మణ్​ దాస్​ యాదవ్​ , బిఏబిఇడి, సావిత్రమ్మ దంపతులు

స్వస్థలం : ప్యాలకుర్తి, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా

కుటుంబ నేపథ్యం:

 వారిది సామాన్య మధ్య తరగతి కుటుంబం.తన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగాపని చేసే వారు.  అమ్మ గృహిణిగా ఉంటూ కుటుంబ కార్యకలాపాల నిర్వర్తణలో చేదోడు వాదోడుగాఉండే వారు.

కుటుంబం: 

వారికి 22.02.1986లో వివాహమైంది. తన జీవిత సహధర్మచారిణి పేరు వై. రాధిక. వారిది పెద్దలు కుదుర్చిన వివాహం. వారికి ఇద్దరు సంతానం. ఇద్దరూ అమ్మాయిలే. వారి పెద్ద కూతురు  పేరు డాక్టర్​ స్నేహ. తాను ఎంబిబిఎస్​, ఎంఎంఎస్​ చదివి అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి అల్లుడు  పేరు కె.హేమంత్​ కుమార్​. తాను ఎండిడిఎం చదివి న్యూరాలజి వైద్యనిపుణుడు.  వారి చిన్నమ్మాయి పేరు సౌఖ్య. తాను బిబిఏ కోర్సు చేసి, యు .కె.లో ఎంబిఏ కోర్సు చేస్తున్నారు.  స్కాట్​లాండ్​లో ఫైనాన్స్​ అండ్​ అకౌంట్స్​ విభాగంలో ఉన్నత విద్యలను అభ్యసించారు.

స్ఫూర్తి… ఆదర్శం..: 

 భాషా పండితుడిగా కొనసాగుతూ… ఎందరెందరో  విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన తన తండ్రే తనకు స్ఫూర్తి ప్రదాత అంటారాయన. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్​ కలాం తనకు ఆదర్శం.  ఎందుకంటే… ఓ సామాన్య వ్యక్తి  . దేశం మెచ్చదగిన శాస్ర్తవేత్తగా మారి, ఆ తరువాత.. దేశానికే రాష్ట్రపతి కాగలిగిన ఘనత అబ్దుల్​ కలాందే. అందుకే ఆయనే తనకు ఆదర్శమని చెబుతారు.

సేవ చేయాలనే..తపన…: 

పదో తరగతిలో ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​లో చేరిన తాను…  ప్రజలకు సేవ చేయాలనే తపన అప్పటి నుంచే అలవర్చుకున్నారు. ఏ పనైనా క్రమశిక్షణ, పట్టుదల..బాధ్యతతో పూర్తి చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అప్పుడే జీవితంలో సక్సెస్​ రుచి ఏమిటో చూస్తారని నిస్పష్టంగా చెప్పారు.

పెద్దలతో… నేర్చుకున్నవి…: 

వైద్యవృత్తిలో రాణించిన తాను సామాన్యుడి విలువ తెలుసుకుని… ప్రజా సేవ చేయాలని తన పెద్దలతో నేర్చుకున్నారు. ఇతరులతో అప్పు చేయరాదు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న తాను.. పదిమందిని ఆదుకొని.. సేవ చేయాలని  ఆకాంక్షిస్తూనే ఉన్నారు.

లక్ష్యం…: 

పేద వాడికి కార్పొరేట్​ స్థాయిలో వైద్యం అందాలన్న కసితోనే… వైద్యవృత్తిని ఎంచుకున్నారు. 1990లో ఆరోగ్యశ్రీ లేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్​గా చేరినప్పటి నుంచి ప్రజలకు హార్ట్​ఫుల్​ గా వైద్య సేవలు అందించారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గుండె సమస్యలతో వచ్చే రోగులకు కార్పొరేట్​ స్థాయిలో అందజేసి… లక్షల మందికి ప్రాణదాతగా నిలిచారు. లక్ష్యం సాధించారు.

తన భార్య… దేవుడి వరం…: 

తాను వైద్య రంగంలో ఎంత ఎదిగినా… తన విజయం వెనుక తన సహధర్మచారిణి ప్రముఖ గైనకాలజిస్ట్​ డా. వై. రాధిక పాత్ర కీలకమని సగర్వంగా చెప్పుకొచ్చారు.  ఆమె ఆలోచన తీరు…మాట్లాడే విధానం.. నా బంగారు భవిష్యత్​కు పునాది వేశాయి. తాను సక్సెస్​ఫుల్​ డాక్టర్​గా రాణించానంటే.. తన భార్య కారణమని చెప్పారు. అందుకే తన భార్య తనకు దేవుడు ఇచ్చిన వరం లా భావిస్తారాయన.

మహానుభావుల స్ఫూర్తితో…: 

వైద్యరంగంలోని వివిధ శాస్ర్తవేత్తలను… భావితరాల వైద్య విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని…. స్మరించుకోవాలన్న ఉద్దేశ్యంతో

కర్నూలు సర్వజన ఆస్పత్రి, మెడికల్​ కళాశాలలో దాదాపు 20 కి పైగా విగ్రహాలను ఆవిష్కరింపజేశారు. 2020లో  రాష్ట్ర గవర్నర్​ విశ్వభూషణ్​ చేతుల మీదుగా డా. అబ్దుల్​ కలాం విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆ తరువాతత  డా. చంద్రశేఖర్​ను రాష్ట్ర గవర్నర్​ అభినందించారు.

హాస్పిటల్​లో​…అభివృద్ధి ఫలాలు..: 

1997లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో  అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా విధులు స్వీకరించిన నాటి నుంచి ఆస్పత్రిలో అభివృద్ధి పరుగులు తీసింది. నిత్యం ఆస్పత్రి అభివృద్ధి వైపు ఆలోచించే డా. చంద్రశేఖర్​… 2000వ సంవత్సరంలో ఐసీసీయూను మంజూరు చేయించారు.  ఇప్పటికీ ఆ విభాగం సక్సెస్​ ఫుల్​గా నడుస్తోంది. అంతేకాక ఆ విభాగంలోనే క్యాథలాక్​ యూనిట్​ ఏర్పాటు చేసి.. రోగులకు యాంజియోగ్రామ్​లు, యాంజియో ప్లాస్లిలు స్టంట్స్​ వేశారు. అదేవిధంగా శిథిలమై… మూలనపడిన కార్డియో థెరాసిక్​ విభాగాన్ని  పున: ప్రారంభించారు. ప్రస్తుతం అందులో గుండె శస్ర్తచికిత్సలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

అలుపెరగని.. ప్రయాణం..: 

 కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రెండేళ్లపాటు  సూపరింటెండెంట్​గా విధులు నిర్వర్తించిన ఆయన… వైద్య సేవతోపాటు ఆస్పత్రి అభివృద్ధి శరవేగంగా చేశారు. ఆరు జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించే కర్నూలు జీజీహెచ్​లో  350 కిలో వాట్ల విద్యుత్​ జనరేటర్​ను ఏర్పాటు చేయించారు. పాత భవనాలకు మరమ్మతు చేయించి… ఉపయోగంలోకి తీసుకొచ్చారు.

అత్యాధునిక టెక్నాలజీతో…ధన్వంతరి హాల్​…: 

పరిపాలన విభాగానికి అవసరమైన సెమినార్​ హాల్​గా ఉపయోగపడుతున్న ధన్వంతరి హాల్​ను అత్యాధునిక టెక్నాలిజీతో ఏర్పాటు చేశారు. అంతేకాక అడ్మినిస్ర్టేటివ్​ బ్లాక్​ను ఆధునికీకరించి… చిరుద్యోగులు సైతం కార్పొరేట్​ స్థాయిలో విధులు నిర్వర్తించేలా సెంట్రల్​ ఏసీని అమర్చారు.

గ్యాస్ర్టో ఎంట్రాలజీ…: 

ప్రభుత్వ ఆస్పత్రిలోని గ్యాస్ర్టో ఎంట్రాలజి విభాగాన్ని ఐసీయూతో ఆధునికీకరించారు. అదేవిధంగా సెంట్రల్​ ల్యాబ్​ను అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయించారు.

స్టేట్​ క్యాన్సర్​ ఆస్పత్రి…: 

విభజన చట్టంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్​కు రూ. 350 కోట్లతో  మంజూరైన స్టేట్​ క్యాన్సర్​ ఆస్పత్రి నిర్మాణానికి తాను శ్రీకారం చుట్టారు.

రోడ్లు..గేట్లు…: 

ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యతతో కూడిన సీసీ రోడ్లు వేసిన ఘనత డా. చంద్రశేఖర్​కే దక్కింది. ఆయన హయాంలోనే సీసీ రోడ్లతోపాటు ఆస్పత్రికి రెండు ప్రధాన గేట్లు ఏర్పాటు చేయించారు. 

ప్రిన్సిపల్​గా.. ముద్ర..: 

కర్నూలు మెడికల్​ కళాశాల ప్రిన్సిపల్​గా బాధ్యతలు  స్వీకరించిన డా. చంద్రశేఖర్​ … తనదైన శైలిలో అభివృద్ధి చేశారు. ఆయన హయంలో సువర్ణయుగం వచ్చిందంటూ అప్పట్లో మెడికల్​ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రజలు అభిప్రాయపడ్డారు. కళాశాల లోపలికి..బయటకు వెళ్లే గేట్లను మరమ్మతు చేయించారు. నూతన, పాత  ఆడిటోరియంలను ఎలక్ర్టానిక్​ పరికరాలతో అమర్చారు. మెడికల్​ ఎడ్యుకేషన్​ యూనిట్​ను ఆధునికీకరించారు.

భద్రత…నిఘా..: 

కళాశాల ఆవరణలో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది భద్రత దృష్ట్యా… సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.  కోవిడ్​ సమయంలో వైద్యవిద్యార్థులందరికీ కోవిడ్​ టెస్ట్​లు చేయించిన ఘనత ఆయనకే దక్కింది.

కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​…: 

ప్రజాప్రతినిధులు…దాతల సహకారంతో కర్నూలు హార్ట్​ హెల్త్​ ఫౌండేషన్​ను ఏర్పాటు చేసిన కీర్తి డా. చంద్రశేఖర్​దే. ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలోనూ .. ఎక్కడా లేనివిధంగా  ప్రతి నెలా వైద్యం, వ్యాధులు తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వర్తిస్తున్నారు.

కర్నూలు హెల్త్ క్లబ్​…: 

కర్నూలు హెల్త్​ క్లబ్​ను ఏర్పాటు చేసిన డా. చంద్రశేఖర్​ .. అందులోనే జిమ్​, యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వరల్డ్​ డాక్టర్స్​ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తున్నారు.

సేవలకు.. పురస్కారం..: 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​, రాయచూరు, మహారాష్ట్ర నుంచి వచ్చే గుండె హృద్రోగులకు… మెరుగైన..శరవేగంగా వైద్య చికిత్సలు చేసి… ప్రాణదాతగా నిలిచిన కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​కు రెండు లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డులు వరించాయి. 2023 జూలైలో నేషనల్​ డాక్టర్స్​ డే సెలబ్రేషన్​లో భాగంగా హైదరాబాద్​ హైటెక్స్​లో లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా ఏపీసీఎస్​ఐ ఆధ్వర్యంలో లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు బహుకరించారు.  రెండు లైఫ్​ టైమ్​ అవార్డులు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది.

డా. చంద్రశేఖర్​కు అరుదైన గౌరవం..: 

 కరోనా ఫస్ట్​ వేవ్​లో ప్రజలకు అందించిన అత్యుత్తమ సేవలకుగాను కర్నూలు సర్వజన ఆస్ప్రతిలోని కార్డియాలజి విభాగాధిపతి డా. చంద్రశేఖర్​కు అరుదైన గౌరవం లభించింది.  ఆయనకు సర్టిఫికెట్​ ఆఫ్​ కమిట్​మెంట్​ అవార్డును వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ సంస్థ అందించింది. విపత్కర సమయంలో వైరస్​ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎంతో ధైర్యంగా వైద్యం అందించారని సంస్థ ప్రతినిధులు కొనియాడిన విషయం తెలిసిందే.

గోల్డ్​​మెడల్​…కైవసం…: 

2019–20లో కోవిడ్​ విజృంభిస్తున్న సమయంలో…  కర్నూలు రెడ్​ క్రాస్​ సొసైటీలో  దాదాపు 1500 మందిని సభ్యులుగా చేర్చిన ఘనత ఆయనకే దక్కింది.​ ఆంధ్రప్రదేశ్​లోని మెడికల్​ కళాశాలలో మొత్తం మీద ఇంత పెద్ద మొత్తంలో సభ్యులుగా చేర్చిన ఆస్పత్రి కార్డియాలజి విభాగాధిపతి  డా. చంద్రశేఖర్​కు గోల్డ్​మెడల్​ దక్కడం… కర్నూలు ప్రజలకే గర్వకారణంగా నిలిచింది.

ఎందరికో ఆదర్శం..: 

కర్నూలు మెడికల్​ కళాశాల ప్రిన్సిపల్​గా ఉంటూ ..ఎంతో మంది విద్యార్థులు వైద్య వృత్తిలో సక్సెస్​గా రాణించేలా కృషి చేశారు.  విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్ది… సక్సెస్​ వైపు అడుగులు వేసేలా చేశానని, ఇది తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చారు. వారందరికీ ఇప్పుడు  ఆదర్శంగా నిలిచారు.

సామాజిక… అన్యాయం…: 

రాయలసీమతోపాటు రాయచూరు, మహబూబ్​నగర్​ జిల్లాల నుంచి వచ్చే గుండె హృద్రోగులకు శరవేగంగా… మెరుగైన వైద్య చికిత్సలు చేసి సక్సెస్​ఫుల్​ వైద్యులుగా నిలిచిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజి విభాగాధిపతి డా. చంద్రశేఖర్​ కు అన్యాయం జరిగిందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిసూపరింటెండెంట్​గా పూర్తి అర్హత ఉన్న తనకు కాదని… వేరొకరికి ఇవ్వడం ఏమిటని పల ప్రశ్నలు సంధించినా ఫలితం లేకపోయింది. తనపై కొందరు చేసిన ఆరోపణలకు ఏమాత్రం విచారణ… వివరణ అడగని ఓ మంత్రి…. తన ఎదుగుదలను అడ్డుకున్నారని చెప్పకనే..చెబుతున్నారు.

రాజకీయ.. అరంగేట్రం…: 

శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులతో … వైద్య వృత్తిలో సక్సెస్​ఫుల్​ డాక్టర్​గా రాణించిన డా. పి. చంద్రశేఖర్​… భవిష్యత్​లోనూ పేదలకు వైద్య సేవలు అందించేందుకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. తాను మెచ్చిన.. అభిమానించిన నేత డా. అబ్దుల్​ కలాం ను ఆదర్శంగా తీసుకుంటూ… ఆయన  ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు.

నేడు పదవీ విరమణ..: 

1997లో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా బాధ్యతలు స్వీకరించి డా. పి. చంద్రశేఖర్​…. తన విజయ ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు… అవార్డులు పొందారు.  ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి ఎందరో మన్ననలు పొందారు. గురువారం (ఆగస్టు 31న) కార్డియాలజిస్ట్​ డా. పి. చంద్రశేఖర్​ పదవీ విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం కార్డియాలజి విభాగంలో ఆయనకు సిబ్బంది ఘనసన్మానం చేయనున్నారు.

About Author