బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలి
1 min read-హైకోర్టు న్యాయవాది గుర్రం రామారావు.. హైకోర్టు తీర్పును గౌరవించాలి
పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: హైకోర్టు తీర్పును గౌరవిస్తూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలని రాష్ట్ర మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది గుర్రం రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జిఓ ఎంఎస్ నెంబర్ 19 ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం రద్దు చేయడం వల్ల దాదాపు 50 వేల మంది కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారిందన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుండి కొనసాగే పథకాన్ని రద్దు చేయడాన్ని తాను హైకోర్టులో నెంబర్ 2271/2021 ద్వారా పిటిషన్ వేసి ఛాలెంజ్ విసిరామన్నారు.ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని మధ్యలో ఆపేయటానికి వీలులేదని ఈ పథకాన్ని తప్పక కొనసాగించాలని సోమవారం నాడు హైకోర్టు ఆర్డర్ కాపీని విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఎస్సీ, ఎస్టీ పిల్లల చదువును వారి నుండి తీసివేయవద్దని ఈ పథకాన్ని తప్పకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వలపర్ల రామకోటి పాల్గొన్నారు.