బాపూజీ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
1 min read
నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు
విద్యార్థులకు ఆటల పోటీలు, బహుమతుల ప్రదానం – ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండల కేంద్రంలోని బాపూజీ ఇంగ్లీష్ మీడియం అప్పర్ ప్రైమరీ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మన్న మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, వారి భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని పేర్కొన్నారు.అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రావతి, ఉపాధ్యాయులు అనీషా, హబీబా, నస్రిన్, సౌజన్య, ఫాతిమా, సౌభాగ్య, పార్వతి, సానియా తదితరులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


