74 ఏళ్ల మహిళను తిరిగి నడిపించిన వైద్యులు
1 min read
వెన్నెముకలో దీర్ఘకాలంగా కంప్రెషన్ ఫ్రాక్చర్లు
19 స్క్రూలతో 6 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స
కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సతో కోలుకున్న వృద్ధురాలు
కర్నూలు, న్యూస్ నేడు: గుంతకల్లుకు చెందిన 74 ఏళ్ల సాలమ్మ అనే వృద్ధురాలు గత కొన్ని నెలలుగా తీవ్రమైన నడుం నొప్పితో అసలు నడవలేకపోతున్నారు. రెండు కాళ్లలోకి కూడా నొప్పి వ్యాపించడంతో ఐదునిమిషాల కంటే కూర్చోవడం, నిలబడడం కూడా ఆమెకు కష్టమైపోతోంది. ఐదేళ్లుగా ఆమెకు అప్పుడప్పుడు నొప్పి వచ్చేది. ఏడాది నుంచి చిన్న చిన్న దూరాలు నడిచేవారు. మూడు నెలలుగా పూర్తిగా మంచానికే పరిమితం అయ్యారు. ఎక్కడికైనా వెళ్లాలంటే వీల్ ఛైర్ వాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో ఆమెను కుటుంబసభ్యులు కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను పరీక్షించి, శస్త్రచికిత్స చేసిన కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ షేక్ మన్నన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ‘‘ఆమెకు అన్నిరకాల పరీక్షలు, ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేసిన తర్వాత.. చాలాకాలం నుంచి ఆమెకు వెన్నెముకలోని డి11, డి12 భాగం వద్ద దీర్ఘకాలంగా కంప్రెషన్ ఫ్రాక్చర్లు ఉన్నాయని తేలింది. దీనివల్ల ఆమెకు మిగిలిన భాగాలు కూడా అరిగిపోతూ క్రమంగా వెన్ను వంగిపోయి గూని రావడం మొదలైంది. ఇది ఎల్4-ఎల్5, ఎల్5-ఎస్1 వద్ద ఉంది. దీంతో ఆమె వెన్నెముకకు శస్త్రచికిత్స చేసి పరిస్థితిని నయం చేయాలని నిర్ణయించాం. శస్త్రచికిత్స తర్వాత సాలమ్మ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఆమె ఇప్పుడు దాదాపు గంటకు పైగా చాలా సులభంగా కూర్చోగలుగుతున్నారు. కాళ్లనొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. లేచి తిరుగుతున్నారు కూడా. అయితే, ఆమె ఎముకలు బాగా బలహీనంగా ఉండడంతో రెండు నెలల పాటు నడవొద్దని సూచించాం. అంతవరకు ఆమెకు మందులు ఇచ్చి, ఎముకలకు బలం వచ్చేలా చూస్తున్నాం. ప్రస్తుతం ఆమె గుంతకల్లులోని తమ ఇంట్లో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాల కారణంగా ఎలాంటి సంక్లిష్టమైన కేసులకైనా ఇక్కడ పూర్తి పరిష్కారం దొరుకుతుంది’’ అని డాక్టర్ షేక్ మన్నన్ వివరించారు.

