ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలి
1 min read
సజావుగా, ప్రశాంతవాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
పోటీలో ఉన్న అభ్యర్ధులతో సమావేశం
సమావేశంలో పాల్గొన్న ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి గురువారం ఏలూరు కలెక్టరేట్ లో ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీల్లో నిలిచిన అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తు.చ. తప్పకుండా పాటించాలని కలెక్టర్ కోరారు. అభ్యర్ధుల ప్రచారంకోసం అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి యంత్రాంగం చేసిన ఏర్పాట్లను, సూచనలను అభ్యర్ధులకు ఆమె వివరించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయవచ్చన్నారు. టి.వి., ఇతర సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో ప్రచారం నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ మోనాటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి, 27వ తేదీ గురువారం జరిగే పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు అభ్యర్ధులు అందరూ సహకరించాలన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో 3,14,984 మంది తమ ఓటుహక్కును వినియోగించుకుంటారన్నారు. ఇందుకోసం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 1,83,347 మంది పురుషులు, 1,31,618 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్ జండర్ లు ఓటుహక్కు కలిగియున్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి తాము అందుబాటులో ఉంటామన్నారు. అదే విధంగా టోల్ ఫ్రీ నెం. 1950 కు ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు. సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఎమ్మెల్సీ ఎన్నికల పోటీల్లో ఉన్న పలువురు అభ్యర్ధులు పాల్గొన్నారు.
