వినియోగదారుల నుండి ఎటువంటి ఫిర్యాదు లేకుండా చూడాలి..
1 min read
జిల్లా జాయింట్ కలెక్టర్:డా.ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులకు ఆదేశం
రైతుబజార్ లో ప్రత్యేక కౌంటర్ల లో బీపీటీ,కెఎన్ఎం /ఆర్ ఎన్ ఆర్ అమ్మకాలను జేసీ ఆకస్మిక తనిఖీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ధరణి-నాణ్యమైన బియ్యం’ కార్యక్రమాన్ని ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పటిష్టంగా అమలు జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్:డా.ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక పత్తేబాద రైతుబజార్ లో ప్రత్యేక కౌంటర్ల లో బీపీటీ , కె ఎన్ ఎం / ఆర్ ఎన్ ఆర్ అమ్మకాలను జేసీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి-నాణ్యమైన బియ్యం’ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.ధరణి- నాణ్యమైన బియ్యం’ కార్యక్రమాన్ని జిల్లాలోని ఏలూరు పత్తేబాద రైతుబజార్, వన్ టౌన్ రైతుబజార్, నూజివీడు రైతుబజార్, మరియు కైకలూరు రైతుబజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బి పి టి రకం బియ్యాన్ని కిలో రూ.49కు, కె ఎన్ యం రకం బియ్యాన్ని కిలో రూ.50కు విక్రయిస్తున్నామన్నారు. . ఒక్కో బస్తాలో 26 కిలోల బియ్యం ఉండేలా ప్యాకింగ్ చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచామని,. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రత్యేక కౌంటర్లలో నిర్ణీత సమయాలలో అమ్మకాలు నిర్వహించాలని, వినియోగదారుల నుండి ఎటువంటి ఫిర్యాదు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యత, స్టాక్ నిల్వలను జేసీ పరిశీలించారు.జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్,పౌర సరఫరాల సంస్థ డిఎం శివరామ మూర్తి, డిటి రమేష్ , రెవిన్యూ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.


