ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల వద్ద విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పని చేయాలి
1 min read
ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలి.. పర్సెప్షన్ సర్వేలో మెరుగైన ఫలితాలు సాధించాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి అత్యంత కీలకమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల వద్ద విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పెన్షన్ పంపిణీ విధానం, ప్రజల అభిప్రాయ సేకరణ, పారదర్శక సేవల అమలుపై మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డీఎల్‌డీఓలు, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, డబ్ల్యూఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్య నారాయణ, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లాలితాభాయి తదితరులు పాల్గొన్నారు.ప్రతి సోమవారం ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ స్థాయిలో పర్సెప్షన్ సమీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తోందని, థర్డ్ పార్టీ బృందాలు కూడా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఎటువంటి లంచాలు ఆశించకుండా పారదర్శకంగా సేవలు అందించాలని, అన్ని ప్రశ్నల్లో 100 శాతం సానుకూల ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. పెన్షన్‌లతో పాటు చెత్త సేకరణ, తాగునీటి నాణ్యత, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై కూడా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు. వారానికి కనీసం రెండు సార్లు చెత్త సేకరణ జరుగుతోందా?, తాగునీటి నాణ్యత సంతృప్తికరంగా ఉందా?, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉందా? వంటి ప్రశ్నలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు.“ప్రభుత్వ ఉద్యోగులమై ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు ప్రజల సంతృప్తి స్థాయి తగ్గిపోతే, వ్యవస్థలో ఎక్కడో లోపం ఉన్నట్టేనని… ఆ లోపాలను సరిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం” అని కలెక్టర్ పేర్కొన్నారు. పర్సెప్షన్ విధానాన్ని ఒత్తిడిగా కాకుండా ప్రజా సేవలను మెరుగుపరచుకునే అవకాశంగా భావించాలని అధికారులను సూచించారు.

