పారదర్శక సేవలతో ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరచాలి
1 min read
అక్షరాస్యత లక్ష్య సాధనలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ప్రజలకు అందించే సేవలలో పారదర్శకత, మర్యాదపూర్వక వ్యవహారం మరియు పనితీరు మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డీఎల్‌డీఓలు, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ మండల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే ప్రతి స్థాయిలో బాధ్యతాయుత వ్యవహారం కనిపించాలని, ముఖ్యంగా స్వర్ణగ్రామ-స్వర్ణవార్డు కేంద్రాలలో సిబ్బంది పనితీరుపై ప్రజల అభిప్రాయాలను క్రమం తప్పకుండా సేకరించాలని ఆదేశించారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండడం, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడం, అదనపు వసూళ్లకు తావులేకుండా సేవలు అందించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. డిజిటల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా కౌశల్య పరీక్ష పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీజీఎస్ స్థాయిలో పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నందున ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.సెక్రటేరియట్ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రజలకు అందించే సేవలను వాట్సాప్ యాప్ ద్వారా నిర్వహించడం ద్వారా సేవలపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయి నుండి అన్ని ఫైళ్లను ఇ-ఆఫీస్ విధానంలోనే పంపించాలని, మాన్యువల్ విధానాలను పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు. అధికారుల పనితీరును ఒపిటిఎస్ ద్వారా అంచనా వేస్తున్నామని, హాజరు, ఇ-ఆఫీస్ వినియోగం, కర్మయోగి కోర్సులు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాను పనితీరు పరంగా అగ్రస్థానాల్లో నిలపడానికి ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజాభిప్రాయంలో చిన్న స్థాయి మెరుగుదల సాధించడమే పెద్ద సవాలుగా ఉంటుందని, అయినప్పటికీ జిల్లాను టాప్-5లో నిలబెట్టే లక్ష్యంతో అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయండి – కలెక్టర్
ప్రస్తుతం జిల్లాలో ఇంకా 2.24 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది 1.12 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మే 28 నుంచి జూన్ 28 వరకు లెర్నర్స్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసి, వాలంటీర్లకు లెర్నర్లను కేటాయించాలని ఆదేశించారు. లెర్నర్ల వివరాల్లో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తల్లిదండ్రుల సమాచారం ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. జూలై 21 నుంచి మార్చి 15 వరకు నిర్వహించే తరగతుల్లో మొత్తం 100 గంటల బోధన, 32 ప్రాక్టీసు వర్క్‌షీట్లు, ఆడియో-విజువల్ శిక్షణ ఉండనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, డబ్ల్యూఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లలితాభాయి తదితరులు పాల్గొన్నారు.

