రాజకీయాలకతీతంగా క్రీడాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
1 min read
– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూష్ నేడు: నగరంలో క్రీడల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక అవుట్ డోర్ స్టేడియం నందు కర్నూల్ ఉమ్మడి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తాము మొదటి నుంచి క్రీడల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీ నందు ఇండోర్ స్టేడియం, ఏపీ ఎస్పీ బెటాలియన్ నందు మరో స్టేడియంని సొంత నిధులతో, అవుట్డోర్ స్టేడియం నందు మరో ఇండోర్ స్టేడియం ను ప్రభుత్వ విధులతో నిర్మించినట్టు ఆయన తెలిపారు. అలాగే పంచలింగాల గ్రామంలో మరో స్టేడియంని నిర్మించేందుకు తలపెట్టినప్పుడు ఎంతోమంది రాజకీయంగా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. అయినప్పటికీ రాజకీయ అడ్డంకులు అన్నింటిని అధిగమించి అక్కడ కూడా స్టేడియంను ఏర్పాటు చేసినట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం జోహారాపురం ప్రాంతంలో ఉన్న పాత డంప్ యార్డ్ నందు ఫుట్బాల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నామని దానికి కూడా ఎంతోమంది అడ్డు తగిలారని టీజీ వెంకటేశ్ వివరించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడలలో కర్నూలు జిల్లా అగ్రభాగంలో ఉందని దీనిని ప్రతి ఒక్కరు కాపాడుకుంటూ క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ డి ఓ భూపతిరావు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భార్గవ, దాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

