రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
1 min read
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
హాస్టల్ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు అందజేసిన షాలేము వృద్ధాశ్రమం నిర్వాహకులు బూసి యేసేబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలోని పత్తేబాదులో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పత్తేబాదులోని నర్సింగ్ స్కూల్ కాంపౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్‌వీ ప్రసాద్ ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఉద్యోగాలు, విద్య కోసం వివిధ ప్రాంతాల నుంచి ఏలూరుకు వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించేందుకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.హాస్టల్ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు అందజేసిన కొవ్వలి గ్రామానికి చెందిన షాలేము వృద్ధాశ్రమం నిర్వాహకులు బూసి యేసేబు, ప్రభావతి దంపతులను, వారి కుమారులు ఎఫ్రాయిం, ఎఫ్తా, రూత్‌లను ఎమ్మెల్యే అభినందించారు. సమాజ సేవలో భాగంగా మహిళల కోసం మౌలిక వసతుల కల్పనకు ముందుకు వచ్చి విరాళం అందించడం అభినందనీయమన్నారు. దాతల సహకారంతో చేపట్టే ఇటువంటి కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.రెడ్‌క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు సత్యనారాయణ రాజు, మాజీ కార్పొరేటర్ ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు, కాంట్రాక్టర్లు మోటేపల్లి చంద్రశేఖర్, బుజ్జి, మేతర అజయ్ బాబు, నిర్మల కుమారి, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


