ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో సేవలను అందించిన సిబ్బందికి ఘన సన్మానం
1 min read
కౌతాళం న్యూస్ నేడు: మండల పరిధిలో గల,శ్రావణమాసం సందర్భంగా ఉరుకుంద శ్రీ ఈరన్న స్వామి దేవస్థానంలో జరిగిన ఉత్సవాలు అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిశాయి. నెల రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.ఉత్సవాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారిని దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేవస్థానంలో అహర్నిశలు శ్రమించిన దేవస్థాన సిబ్బందికి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణలో సేవలందించిన పోలీస్ సిబ్బందికి, అలాగే ఉత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన పాలక మండలి సభ్యులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మాట్లాడుతూ… శ్రావణమాసం అంటే ఉరుకుంద క్షేత్రానికి అత్యంత కీలకమైన సమయం. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేసి స్వామి వారి ఉత్సవాలను విజయవంతం చేశారని కొనియాడారు. సిబ్బంది, పోలీసులు, పాలక మండలి సభ్యుల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.సన్మానం అందుకున్న సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తూ, స్వామి వారి సేవలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.



