NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్

1 min read

విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకం – ప్రధానోపాధ్యాయులు

హొళగుందన్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిల్లల విద్యా ప్రగతి, హాజరు, ప్రతిభ, అభ్యాస నైపుణ్యాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఉపాధ్యాయులతో సమగ్రంగా చర్చించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివశంకర్ గౌడ్, మిక్కిలినేని శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.కార్యక్రమంలో ప్రతి విద్యార్థి విద్యా పురోగతిపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వివరించారు. పిల్లల అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మెగా పీటీఎం ఎంతో ఉపయోగకరమైన వేదికగా నిలుస్తోందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.తల్లిదండ్రుల కోసం నిర్వహించిన సరదా ఆటలు ఆకట్టుకోగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు, ఉపాధ్యాయులు కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ప్రతిరోజూ తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, షూస్ తదితర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలలో సాంకేతిక విద్యతో పాటు వృత్తి విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడం అందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఛైర్మన్, కమిటీ సభ్యులు, సీఆర్పీలు, గ్రామ ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author