NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమస్యల వలయంలో చిక్కుకున్న గుడిపాడు గ్రామం దళితవాడ: సీఐటీయూ, కేవీపీఎస్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: కుల వివక్ష పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర పిలుపులో భాగంగా సీఐటీయూ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో ప్రజల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఏ. చిన్న రహిమాన్, కేవీపీఎస్ నాయకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.గ్రామంలో తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉందన్నారు. మురికి కాలువ సమీపంలో ఉన్న పైప్‌లైన్ ద్వారా వచ్చే నీటిని వంతుల వారీగా పట్టుకోవాల్సి వస్తోందని, నీటి కోసం దాదాపు 200 బిందెలు వరుసలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అయితే సుమారు 50 బిందెల వరకు మాత్రమే నీరు రావడంతో మహిళలు నీటి కోసం గొడవపడే పరిస్థితి నెలకొందన్నారు. పనులకు వెళ్లకుండా నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలోని దళితుల శ్మశానానికి కేవలం ఎనిమిది సెంట్ల స్థలం మాత్రమే ఉందని, ప్రభుత్వం కనీసం ఒక ఎకరం భూమిని కేటాయించి బోరు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.గ్రామంలో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన, ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు జ్వరాలు, కీళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.గతంలో ఐదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలను ప్రస్తుతం రెండో తరగతి వరకు మాత్రమే పరిమితం చేశారని, దీంతో విద్యార్థులు సమీపంలోని పీఆర్‌పల్లెకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందన్నారు. గుడిపాడులోనే కనీసం ఏడో తరగతి వరకు పాఠశాల ఏర్పాటు చేసి, తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.గ్రామంలో దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవడం, హోటళ్లలో రెండు గ్లాసుల విధానం కొనసాగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇవి రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులకు పూర్తిగా విరుద్ధమని అన్నారు.జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, కుల వివక్షను పూర్తిగా అంతం చేసి అందరికీ సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొమ్ము రాముడు, చెన్న కృష్ణ, రంగయ్య, జయరాముడు, కొండయ్య, వెంకట్ నారాయణ, సూర్యనారాయణ, నరసింహులు, కృష్ణయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author