ఉద్యాన సాగును ఇంకా విస్తరించాలి
1 min read
సీజన్‌లోపు జలధార-జలహారతి పనులు పూర్తయ్యేలా ఫోకస్ పెట్టాలి
ఇరిగేషన్ ప్రాజెక్టులకు మరమ్మతులను వెంటనే చేపట్టాలి
కర్నూలు జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు, న్యూస్ నేడు: పాలన పట్ల ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా మరింత మెరుగైన సేవలు అందించాలని కర్నూలు జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం అనంతరం అక్కడి కార్యాలయంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘. జిల్లా అధికారులు సమిష్టిగా పని చేసి మంచి ఫలితాలను సాధించాలి..క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసి పని తీరు సరిగా లేకపోతే ప్రజల్లోనే నివేదికలు ఉంచుతాం.”అని సీఎం చెప్పారు.
మెరుగైన వంగడాలతో ఉల్లి సాగు చేసేలా ప్రోత్సాహం: జిల్లాలో ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లక్ష కోట్ల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఉద్యాన సాగును గణనీయంగా పెంచాలి. పత్తికొండ నియోజకవర్గంలో ఉద్యాన సాగు చాలా తక్కువగా ఉంది. డ్రిప్ ఇరిగేషన్‌తో పాటు పెరెన్నియల్ హార్టికల్చర్ సాగును పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉల్లి సాగుకు సంబంధించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, మెరుగైన వంగడాలతో ఉల్లి సాగు చేసే విధంగా రైతులను చైతన్యవంతం చేయాలి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో మెరుగైన అభివృద్ధి సాధించాలి. ప్రజలకు ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు.
భూగర్భ జలాలు పెంపుపై దృష్టిసారించండి:జిల్లా సమీక్షలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించారు. ప్రాజెక్టుల మరమ్మత్తులకు సంబంధించి రూ.100 కోట్లు అవసరమని మంత్రి రామానాయుడు తెలపగా… వాటిని వెంటనే చేపట్టి 6 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘జలధార-జలహారతికి సంబంధించి 246 చెరువులకు సంబంధించిన పనులను ఈ సీజన్‌లోపు పూర్తి చేయాలి. భూగర్భ జలాల స్థాయిని 3 మీటర్లకు పెంచేలా చెక్‌డ్యామ్ మరమ్మతులు, కాంటూరు ట్రెంచెస్ తదితర నీటి సంరక్షణ పనులను చేపట్టాలి. కోసిగి మండలంలో భూగర్భ జలస్థాయి త్వరగా తగ్గిపోతున్నందున, రాష్ట్రంలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులున్న ప్రాంతాలపై విశ్లేషించాలి. వివిధ సాంకేతిక విధానాలను అవలంభించి, భూగర్భ జలాల స్థాయిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం సూచించారు. గుంతలు లేని రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు ప్రజలకు సక్రమంగా అందేలా విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఓఆర్, ఎఫ్‌లైన్ పిటిషన్ లను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రీ సర్వేలో సంతృప్తి శాతం పెరిగిందన్న ముఖ్యమంత్రి…. జిల్లా అధికారులను అభినందించారు. శాంతి భద్రతల విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
విత్తన యాప్‌పై రైతులకు అవగాహన అవసరం
యూరియా సరఫరా, విత్తనాలకు సంబంధించి మంచి ఫీడ్‌బ్యాక్ ఉందని, విత్తన యాప్ గురించి అవగాహన కల్పించి, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. బీసీ, ఎస్సీ వసతి గృహాలలో పిల్లలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఎంపీ నాగరాజు, జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు -ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


