భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి…
1 min read
ఇంద్రకీలాద్రి న్యూస్ నేడు :శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం వేకువజాము నుండి భవానీ దీక్షాధారులు, సామాన్య భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీక్షా విరమణల నిమిత్తం సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన వేలాది మంది భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి క్షేత్రమంతా అరుణవర్ణ శోభితమై, ‘జై భవానీ’ నామస్మరణతో మార్మోగింది. ఉదయం నుండే అటు ఘాట్ రోడ్డు, ఇటు కనకదుర్గ నగర్ వైపు నుండి భక్తులు పోటెత్తడంతో కొండమీద క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు, భవానీలకు సత్వర దర్శనం కల్పించేందుకు దేవస్థాన యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది.భక్తుల రద్దీ నియంత్రణలో భాగంగా ఉదయం నుండే శ్రీ అమ్మవారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ అమ్మవారికి మహానివేదన సమర్పించిన తర్వాత, సాధారణ భక్తుల దర్శనానికి మరింత వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో అన్ని రకాల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను సైతం రద్దు చేసి, క్యూలైన్లలో ఉన్న భక్తులందరికీ పూర్తిగా ఉచిత దర్శనం (సర్వదర్శనం) మాత్రమే అమలు చేస్తున్నారు.క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా తాగునీరు పంపిణీని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరూ దేవస్థాన సిబ్బంది, భద్రతా సిబ్బందికి సహకరించి క్రమశిక్షణతో శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకోవాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారివి.కె. శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు.



