జనరిక్ మెడికల్ స్టోర్లలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు – జేసీ శ్రీనివాసులు
1 min read= జనరిక్ మెడికల్ స్టోర్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలి
పల్లెవెలుగువెబ్, కర్నూలు, సెప్టెంబర్ 22: జనరిక్ మెడికల్ స్టోర్లలో తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందుబాటులోకి తెస్తున్నట్లు జిల్లా ఆసరా, సంక్షేమ విభాగం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. ఈమేరకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో జనరిక్ మందుల దుకాణాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజల్లో జనరిక్ మందుల నాణ్యతపై అవగాహన కలిపంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే నాణ్యమైన మందులు విక్రయించేందుకు జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయనుందన్నారు. కర్నూలుల 2 దుకాణాలు, నంద్యాలలో-1 జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు. జనరిక్ మందుల షాపుల నిర్వాహకులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తప్పకుండా షాపులు తెరిచి ఉంచాలన్నారు. జనరిక్ మందుల షాపుల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మందుల షాపులో పనిచేసే ఫార్మసిస్టు లు షిఫ్ట్ ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. జనరిక్ మందుల షాపుల అభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి వెంకటేశ్వర్లు, మెప్మా పిడి శిరీష, సిఎస్ఆర్ఎమ్ఓ హేమ నలిని, డిస్టిక్ హాస్పిటల్ నంద్యాల సూపరింటెండెంట్ విజయ్ కుమార్, జనరిక్ మందుల షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.