NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్తిక దీపం – అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: పరమ పవిత్రమైన కార్తిక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో కర్నూలు నగరం, నాగిరెడ్డి రెవిన్యూ కాలనీలోని శ్రీ భరతమాత దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ధార్మిక ప్రవచన సప్తాహంలో మొదటి రోజు కార్తిక స్నాన, దీప, దాన, ఉపవాస మహిమలు అనే అంశంపై డాక్టర్ తొగట సురేశ్ బాబు ప్రవచనం భక్తులను ముగ్దులను చేసినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాసాలలో కార్తిక మాసం అత్యంత శ్రేష్ఠమైనదని, ఈ మాసం శివకేశవులిరువురికి అత్యంత ప్రీతికరమైనదని తెలిపారు. కార్తిక మాసంలో వెలిగించే ఒక్క దీపం కోటి జన్మల పాపాలను హరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయని, దీపం కేవలం వెలుగును ఇవ్వడమే కాకుండా మనలోని అజ్ఞానం, అహంకారం అనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుందని వివరించారు. శివాలయంలో, విష్ణు ఆలయంలో, తులసి కోట వద్ద, నదీ తీరంలో దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, కార్తాక మాసంలో చేసే అన్నదానం, వస్త్రదానం, దీపదానం, గోదానం అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తాయని, దానం చేసే చేతులు ఎప్పుడూ పై చేయిగానే ఉంటాయని తెలిపారు. తనకు ఉన్నదానిలో కొంత ఇతరులకు పంచడమే నిజమైన ధర్మమని సూచించారు. కార్తిక సోమవారం, ఏకాదశి రోజుల్లో చేసే ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా, మనస్సును భగవంతుని వైపు మళ్ళిస్తుందని, ఇంద్రియ నిగ్రహానికి, ఆత్మశుద్ధికి ఉపవాసం మార్గమని, కార్తిక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పుణ్య స్నానం గంగా స్నానంతో సమానమని, పాపాలను ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. కార్తిక మాసం అంటే కేవలం ఆచారాలు కాదు, అది ఒక జీవన విధానమని, దీపం వెలిగించినట్లుగా ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో భక్తి జ్యోతి వెలగాలని ప్రవచనకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీ భరతమాత సేవాసమితి అధ్యక్షులు సందడి మహేశ్వర్, అర్చకులు భరద్వాజ శర్మ, విష్ణు సహస్ర నామసంఘం అధ్యక్షులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి, ఎస్వి నారాయణరెడ్డి, ఎన్. చంద్రారెడ్డి, వై శివశంకర్ రెడ్డి, వసుంధరమ్మ, లావణ్య, సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *