మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం
1 min read

– రాష్ట్ర మంత్రి టి.జి భరత్
అమరావతి, న్యూస్ నేడు : రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ పార్కులను కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. శాసనమండలిలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నోడ్, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు నోడ్, కడప జిల్లాలోని కొప్పర్తి నోడ్, అనకాపల్లి జిల్లాలోని బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ 2,088 ఎకరాలు, చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ క్రింద కృష్ణపట్నం నోడ్ 2,066 ఎకరాలు, హైదరాబాద్ బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్లులో 2,621 ఎకరాలు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద కడప జిల్లాలోని కొప్పర్తి కారిడార్ 2,136 ఎకరాల్లో పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని వివరాలు తెలిపారు. ఇవే కాకుండా ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ కింద అభివృద్ధి చేసేందుకు 5 ప్రపోజల్స్ వచ్చాయన్నారు. వెయ్యి ఎకరాల లోపు ఉన్న వాటికోసం 14 అప్లికేషన్స్ వచ్చాయన్నారు.
కుటుంబంలో ఒకరు.. పారిశ్రామిక వేత్తగా…
ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామిక వేత్తగా ఎదగాలనే పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్. అందులో భాగంగానే రాష్ట్రానికి పరిశ్రమలు ఆకర్షించేందుకు మంచి పాలసీలు రూపొందించి గైడ్ లైన్స్ విడుదల చేశామన్నారు. పరిశ్రమలకు భూకేటాయింపులకు సంబంధించి సభ్యులకు ఏదైనా సందేహాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని మంత్రి టి.జి భరత్ తెలిపారు.

