కార్మిక సంఘాలపై నారా లోకేష్ వ్యాఖ్యలు ఖండనీయం
1 min read
– వెంటనే క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మానవత్వం లేనివిగా ఉన్నాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తీవ్రంగా విమర్శించారు.ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి కోటి రూపాయల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కార్మిక సంఘాల నాయకులు కోరడం సహజమైన విషయమని అన్నారు. అలాంటి సమయంలో కార్మిక నాయకులపై అసహనంతో స్పందిస్తూ, “మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా” అనే విధంగా మాట్లాడటం ఒక బాధ్యతాయుత నాయకుడికి తగదని పేర్కొన్నారు.ఒక నాయకుడికి ఓర్పు, సహనం, ప్రజల బాధల పట్ల స్పందించే మనసు ఉండాలని, అవి లేనప్పుడు నాయకత్వానికి అర్హత ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. కార్మికులు, కార్మిక సంఘాలు అంటే ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా లోకేష్‌కు అంత చులకన భావమా అని ప్రశ్నించారు.గతంలో ప్రమాద ఘటనల్లో మరణించిన కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల పరిహారం ప్రకటించి ఆదుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించేందుకు కూడా వెళ్లకపోవడం బాధాకరమని విమర్శించారు.కార్మిక సంఘాల నాయకులు, కార్మికులపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే కార్మిక సంఘాల నాయకులకు, కార్మికులకు మరియు బాధిత కుటుంబాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఏ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారో కూడా ప్రజలకు అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి విమర్శించారు.


