‘నీట్ -పీజీ 2026’ పరీక్ష…
1 min read
జిల్లాలో 7 కేంద్రాలు, 98.72 శాతం విద్యార్థులు హాజరు
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ జిల్లాలో ఆదివారం ‘నీట్ -పీజీ 2026’ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.ఆదివారం స్థానిక పుల్లారెడ్డి, కె.వి.సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 ఆన్లైన్ పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పీజీ–2026 ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 2114 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, అందులో 2087 మంది పరీక్షకు హాజరయ్యారని, 27 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో 98.72 శాతం హాజరు నమోదైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ పూర్తిగా సజావుగా, పారదర్శకంగా మరియు నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు. అన్ని కేంద్రాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేశారని, హాల్ టికెట్ తనిఖీలు వంటి విధానాలు సమర్థవంతంగా నిర్వహణ జరిగాయన్నారు. అదే విధంగా, పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, వైద్య సహాయం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలను సమృద్ధిగా కల్పించామన్నారు..కలెక్టర్ తో పాటు కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


