కొత్త కార్మిక చట్టాలు పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర కార్మిక సంఘాలు , కిసాన్ సంయుక్త మోర్చా, అలాగే బ్యాంకింగ్ రంగ ఉద్యోగ సంఘాలు AIBEA, AIBOA, BEFI ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సార్వత్రిక సమ్మె కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కర్నూలు నగరంలో ఉదయం 11.00 గంటలకు ఉద్యోగ–కార్మిక–రైతు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు కలిసి జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన నాయకులు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడులు కార్మికులు, రైతులు, ఉద్యోగులకు తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చట్టాల వల్ల యువతకు శాశ్వత ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని, ఉద్యోగ భద్రత పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.కొత్త కార్మిక చట్టాలు పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండి, గతంలో కార్మికులు దీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను రద్దు చేసే విధంగా ఉన్నాయని, ఇది కార్మిక వర్గానికి చేసిన ఘోర ద్రోహమని విమర్శించారు. ఈ లేబర్ కోడులు పూర్తిగా రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఇ. నాగరాజు, శివకృష్ణ, హనుమంత రెడ్డి, వి.కె. వాసు, ఎల్లయ్య, వాసుదేవ రెడ్డి, అజయ్, పద్మావతి, కృష్ణమోహన్, మంజీరవాణి తదితరులు పాల్గొన్నారు. వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు సహా సుమారు 300 మంది ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

