జీవన్‌దాన్ ద్వారా అవయవదానం.. ముగ్గురికి కొత్త జీవితం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ కుటుంబ సభ్యులు విషాద సమయంలోనూ మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఆమె అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అందించేందుకు వివిధ ఆసుపత్రులకు తరలించారు.వివరాల్లోకి వెళితే.. నంద్యాల సమీపంలో పి. రవణమ్మ (36) ప్రమాదానికి గురయ్యారు. ఆమె తన సాధారణ పనిలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ, ఆమె పరిస్థితిని పరిశీలించిన అనంతరం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకుని ఆమె అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. అవయవదాన ప్రక్రియలో భాగంగా జీవన్‌దాన్ నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు 02 అక్టోబర్ 2026న అవయవాలను సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇందులో ఒక కిడ్నీని మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ కు, కాలేయాన్ని గౌరీ గోపాల్ హాస్పిటల్ కు, మరో కిడ్నీని కిమ్స్ హాస్పిటల్స్, నెల్లూరుకు తరలించారు.అవయవాలను సకాలంలో సంబంధిత ఆసుపత్రులకు చేర్చేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా రవాణా ప్రక్రియను చేపట్టారు. పోలీసు, వైద్య, సంబంధిత అధికారుల సమన్వయంతో అవయవాల తరలింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “రవణమ్మ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ అవయవదానానికి ముందుకు రావడం ఎంతో గొప్ప మానవతా నిర్ణయం. ఒక వ్యక్తి మరణించిన అనంతరం కూడా ఆమె అవయవాల ద్వారా ఇతరులకు జీవించే అవకాశం కల్పించడం నిజంగా గొప్ప విషయం. అవయవదానం ద్వారా మరికొందరి జీవితాల్లో ఆశను నింపవచ్చనే సందేశాన్ని ఈ కుటుంబం సమాజానికి అందించింది” అని అన్నారు.అవయవాలు సకాలంలో తరలింపులో సహకరించిన వైద్య బృందాలు, పోలీసు అధికారులు, సంబంధిత సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, కుటుంబ సభ్యుల సమ్మతితో అవయవదానం చేయడం ద్వారా మరెంతో మందికి జీవనావకాశం కల్పించవచ్చని తెలిపారు.రవణమ్మ కుటుంబం తీసుకున్న నిర్ణయం పట్ల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అభినందనలు తెలిపారు. ఆమె అవయవాల ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.


