అర్జీదారులు సంతృప్తిని చెందేలా స్వీకరించిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
1 min read
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ( మీ కోసం) కార్యక్రమానికి జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇన్చార్జి డిఆర్వో, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవో లు కె.లక్ష్మీప్రసన్న, యం.వి. రమణ లు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధేశించిన సమయంలోగా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పిజిఆర్ఎస్ (మీ కోసం), రెవిన్యూ క్లినిక్ లు నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి, మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంటు ఇవ్వాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకసారి వచ్చిన ఫిర్యాదు మరలా రాకుండా అధికారులు అత్యంత బాధ్యతతో చక్కని పరిష్కారం చూపాలని అన్నారు.
ఈ రోజు స్వీకరించిన అర్జీలలో కొన్ని
పెదవేగి మండలం దొండపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ నా భూమి, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి భూములు కలిసి ఉండుటవలన ఇబ్బందులు ఉన్నాయని పరిష్కారం చూపాలని కోరారు, చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన పొట్టి నాగరాధారాణి నాకు ఉన్న 30 సెంట్లు భూమి సర్వేచేసి, హద్దులు నిర్ణయించాలని కోరారు, చింతలపూడి మండలం వైయస్సార్ కాలనీ నిరుపేద కుటుంబం పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాము కాని బిల్లులు జమ కావడం లేదని పరిష్కారం చూపాలని కోరారు, కలిదిండి మండలం చినతాడినాడ గ్రామానికి చెందిన సొర్రా యువరాజు మా ఇండ్ల నుండి మురుగునీరు పోయే తూములను పూడ్చి వేసారని, పక్కా డ్రైనేజీ నిర్మించాలని కోరారు, కైకలూరు మండలం వరాహపట్నం గ్రామానికి చెందిన పళ్ళెం సర్వయ్య పట్టాదారు పాసుపుస్తకం ప్రకారం భూమితగ్గిందని, సర్వేచేసి నా భూమిని కరెక్టుగా అప్పగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.


