తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు
1 min read
నగరపాలక అధికారులతో మంత్రి టి.జి. భరత్ సమీక్ష
నగర ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి
పారిశుద్ధ్యం, కుక్కల సమస్య పరిష్కారానికి దృష్టి సారించండి
అభివృద్ధి పనులను గడువులోపు పూర్తి చేయాలి
కర్నూలు , న్యూస్ నేడు: వచ్చే వేసవిలో నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి. భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి నగరపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు.స్మార్ట్ సిటీకి ధీటుగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రగతి ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత గడువులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో కార్పొరేషన్ పరిధిలోని 52 వార్డుల్లో ఎలాంటి తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా, అవసరమైన ముందస్తు చర్యలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరచాలని, కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సల రోజువారీ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చెత్తా సేకరణ వాహనాల కొరత ఉన్నందున, మరమ్మత్తులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. పూడికతీత పనులు మరింత వేగవంతం చేయాలని, ఫిర్యాదులు రాకుండా ముందుగానే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, రహదారుల నిర్మాణం, విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని, నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తగు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి అర్హులందరికీ అందేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో కమిషనర్ యస్.రవీంద్ర బాబు, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, మేనేజర్ యన్.చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, ఆర్‌ఓ జునైద్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు, సూపరింటెండెంట్లు సుబ్బన్న, స్వర్ణలత, రామకృష్ణ, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.