హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కల్పించండి
1 min read

న్యూస్ నేడు పత్తికొండ: పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గ్రామ ప్రజలు సోమవారం ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహోల్ది గ్రామ పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన హౌసింగ్ కాలనీలో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ ప్రజల తరఫున మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి వినతి పత్రం సమర్పించారు.కాలనీలో వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, తాగునీటి సదుపాయం వంటి ప్రాథమిక అవసరాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పంచాయతీ నుంచి తాగునీటి సరఫరా లేకపోవడం, ప్రభుత్వం వేసిన బోరు నుండి ఉప్పు నీరు రావడం వల్ల ఆ నీరు తాగడానికి పనికిరావడం లేదని కాలనీ ప్రజలు తెలిపారు.ప్రత్యేకంగా వర్షాకాలంలో రోడ్లు లేకపోవడంతో గుంతల్లో నీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. కాలనీలో నల్ల జిగురు మట్టి ఉండడం వల్ల వర్షం పడినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గతంలో ఒక వ్యక్తి జారి పడిన ఘటన కూడా చోటుచేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.కాబట్టి చిన్నహోల్ది గ్రామ హౌసింగ్ కాలనీలో వెంటనే రోడ్లు నిర్మించడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ కాలువలు నిర్మించడం, పంచాయతీ ద్వారా తాగునీటి సదుపాయం కల్పించడం వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు ఎంపీడీవో ని కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు శివ, నరసింహులు, రజాక్, కాసిం తదితరులు పాల్గొన్నారు.

