అంగరంగ వైభవంగా రాఘవుని 430 వ జన్మదిన వేడుకలు
1 min read
నవరత్న రథంలో ఘనంగా రాఘవేంద్రుడి ఊరేగింపు
450 మంది బృందంచే నాదహర సంగీతం
విశేషంగా తరలివచ్చిన భక్తులు
మంత్రాలయం, న్యూస్ నేడు: మంత్రాలయం పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున జీవసమాధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం కోరినవారి కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీ రాఘవేంద్ర స్వామి 430వ జన్మదిన వేడుకలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువైభవోత్సవాలలో భాగంగా చివరి రోజు శ్రీ రాఘవేంద్ర స్వామి 430వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని, మూల బృందావనానికి విశేష క్షీరాభి శేకం, ఫల పుష్పాభి శేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను మూల బృందావనాన్నికి సమర్పణ చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం మఠం ప్రాకారంలో నవరత్న రథోత్సవంపై స్వామి వారి ప్రతిమను ఉంచి ఆశేష భక్తుల, మంగళ వ్యాయిదల నడుమ ఘనంగా ఊరేగించారు. ఊంజాల సేవా మండపంలో తమిళనాడు రాష్ట్రం, చెన్నై నుంచి వచ్చిన సుమారు 450 మంది భక్తులు నాదహర బృందంచే సంగీత వాయిద్యం ప్రదర్శించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వేడుకలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని , రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థుల ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పండిత కేసరి రాజా యస్ గిరియాచార్యులు, మేనేజర్ , వెంకటేష్ జోషి, ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్,మాజీ మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు , ధార్మిక సిబ్బంది బిందుమాధవాచార్, కుర్డి జయ తీర్థాచార్ తదితర మఠం పండితులు, అధికారులు పాల్గొన్నారు.

