పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటిసులు
1 min read

అప్పటికీ చెల్లించకపోతే మున్సిపల్ సేవలు కట్
రెవెన్యూ, అడ్మిన్ సిబ్బందితో కమిషనర్ పి.విశ్వనాథ్
టాప్-20 మొండి బకాయిదారులపై ప్రత్యేక ఫోకస్
ప్రతి వార్డులో రోజువారీ వసూళ్ల మానిటరింగ్
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగరంలో పన్ను ఎగవేతదారులకు, దీర్ఘకాలిక పెండింగ్లతో ఉన్న పన్నుదారులకు రెడ్ నోటిసులు జారీ చేసి వసూళ్లను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ రెవెన్యూ విభాగ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆయన ఆర్వోలు, ఆర్‌ఐలు, నోడల్ అధికారులు, అడ్మిన్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టాప్–20 మొండి బకాయిదారులపై తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ఈ నెలాఖరులోగా మొండి బకాయిలను సమన్వయంతో రాబట్టాలని, ప్రగతి పన్నుల ఆవశ్యకతను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు.ప్రతి పన్ను ఎగవేతదారుడికి, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పన్నుదారులకు ముందుగా రెడ్ నోటిసులు ఇవ్వాలని, అయినప్పటికీ స్పందించకపోతే మున్సిపల్ సేవలను నిలిపివేయాల్సి వస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఆస్తి పన్ను మాత్రమే కాక తాగునీటి కొళాయి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ బకాయిలు వంటి అన్ని వసూళ్లపై నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి వార్డులో రోజువారీ వసూళ్ల పురోగతిని మానిటర్ చేయాలని, లక్ష్యాలు నెరవేర్చడంలో ఎటువంటి నిర్లక్ష్యానికీ తావులేదని హెచ్చరించారు.టెలికాన్ఫరెన్స్‌లో ఆర్వోలు జునైద్, స్వర్ణలత, వాజీద్, ఆర్‌ఐలు, నోడల్ అధికారులు, అడ్మిన్లు పాల్గొన్నారు.

