రెవెన్యూ ఉద్యోగులు సేవా భావంతో ఉండాలి
1 min read

సేవలో.. రెవెన్యూది కీలకపాత్ర
ఏపీ రెవెన్యూ శాఖలో నూతన సంస్కరణలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: రెవెన్యూ ఉద్యోగులు సేవా భావంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ డే సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూ శాఖ ది కీలకమైన పాత్రని , లా అండ్ ఆర్డర్, విపత్తు నిర్వహణ, ఫైల్స్ నిర్వహణ తదితర పబ్లిక్ కి సంబంధించి ఏ సర్వీసు అయినా మొట్టమొదటిగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ అన్నారు. బ్యాంక్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానంతో లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యుల్ సాఫ్ట్వేర్ తెచ్చామన్నారు. ఈ యాప్ కి జాతీయ స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అవార్డ్ వచ్చిందన్నారు.
ప్రలోభాలు..ఒత్తిడి అధిగమించాలి: జేసీ బి.నవ్య
అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అతి ప్రాచీనమైన శాఖ అన్నారు.. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలు ఈ శాఖ నుండి ఉద్భవించినవే అని, ప్రజలతో మమేకమైనది రెవెన్యూ శాఖ అన్నారు.. అత్యధికంగా ప్రజలకు కావలసిన పనులు, వారి సమస్యల బాధ్యతలు మోయవలసిన శాఖ రెవెన్యూ శాఖ అన్నారు.. ఈ శాఖలో ప్రలోభాలు,వత్తిడి అధికంగా ఉంటాయని, వాటిని అధిగమించి పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
శ్రీరామదాసు ఆదర్శం : ఇన్చార్జ్ డీఆర్ఓ వెంకటేశ్వర్లు
ఆ తరువాత ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో శ్రీరామదాసు ( కంచర్ల గోపన్న ) భద్రాచలం తహసీల్దారుగా బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని రెవెన్యూ శాఖ సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం మనం చేస్తున్న అన్ని ఆన్లైన్ సేవలు దాదాపు మన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గారి ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
విశ్రాంత ఉద్యోగులకు సన్మానం..
అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు శ్రీమతి శశిదేవి, క్రిస్టఫర్, జయన్న, విజయుడు, హుస్సేన్, రమణ, ఆదినారాయణ, రామన్న, ఎల్ల రాముడు తదితరులను రెవెన్యూ సంఘం తరఫున కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
ఉద్యోగుల రక్తదానం..
అంతకముందు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో రెవెన్యూ డే సందర్భంగా రెవిన్యూ ఉద్యోగుల రక్తదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ లను అందచేశారు. సమావేశంలో హౌసింగ్ పిడి చిరంజీవి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, అజయ్ కుమార్ , కొండయ్య, నాగ ప్రసన్న, సునీతా బాయ్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివ రాముడు, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.



