విశ్వజనీనసూత్రాల సమాహారం సనాతనధర్మం
1 min read
– డా. బోలుగద్దె అనిల్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు: సంస్కృతి, కులమత ప్రాంతభేదాలు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ వర్తించే ప్రాథమికసూత్రాలనే విశ్వజనీన సూత్రాలంటారని, సత్యం, అహింస, చర్యకు ప్రతిచర్య వంటి కర్మ సిద్ధాంతం, కారుణ్యం, ప్రకృతి ధర్మాలు ఇవన్నీ విశ్వజనీన సూత్రాలేనని, ఈ సూత్రాలన్నీ సనాతనధర్మానికి ఆధారభూతమైన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైన వాటిలో ఉన్నాయనీ, ఈ సూత్రాలు మహర్షుల ద్వారా ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ధర్మసూత్రాలుగా వర్గీకరింపబడి మన వరకు అందాయని, ఈ ధర్మాలు మూర్తీభవించి దశావతారాలుగా భారతదేశముపై నడయాడినాయని, విదేశీయుల విజ్ఞాన పరిశోధనల్లో సైతం తమ ఉనికిని చాటినాయని ప్రవచనకర్త డా. బోలుగద్దె అనిల్ కుమార్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం, పెద్దకొట్టాల గ్రామంలోని శ్రీ రామాలయం నందు ఏర్పాటుచేసిన ధార్మిక ప్రవచనాల్లో భాగంగా వారు మొదటి రోజు ధార్మిక సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామాలయం కమిటీ చైర్మన్ అన్నెపురెడ్డి నాగప్రసాద్ రెడ్డి, గండా బాలశివారెడ్డి, సుబ్బారావు, రాముడు, పెద్ద వీరయ్య, లక్ష్మిదేవి, ఈశ్వరరావు, కుమ్మరి మద్దిలేటి, బి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6-00 గంటలనుండి 8-00 గంటల వరకు జరుగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు.


