సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి – కలెక్టర్ పి.కోటేశ్వరరావు
1 min read = ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పు ప్రజలకు చేరవేయాలని ఆదేశం
పల్లెవెలుగువెబ్, కర్నూలు, సెప్టెంబర్ 23 : వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల అమలను సమగ్రంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఆశయసాధనకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది సేవలందించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. గురువారం కర్నూలు నగరంలోని 72(రామచంద్రనగర్), 73(శారదానగర్), 74(ఉద్యోగనగర్)వ వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయటవైపున ప్రదర్శించాలన్నారు. ఆయా సచివాలయాల పరిధుల్లో 18ఏళ్లు పైబడిన వారికి ఎంత మందికి వ్యాక్సిన్ వేశారని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. 18–45ఏళ్లలోపు ఉన్న వారు, గర్భవతులు అందరికీ అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని ఏఎన్ ఎంను ఆదేశించారు. వార్డు పరిధుల్లో మహిళలకు దిశా యాప్ పై అవగాహన కల్పించాలని మహిళా పోలీస్లను సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తూ సచివాలయ సేవ గురించి ఇంటింటికి తెలియజేసి ప్రజల మన్ననలు పొందేలా పనిచయాలన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.