అవయవదానంతో తోబుట్టువులకు ప్రాణం ..
1 min read* తమ శరీర అవయవాలను దానం చేస్తున్న సోదర, సోదరీమణులు
* స్ఫూర్తిదాయంగా పలువురి జీవితగాధలు
* కిమ్స్ సవీరలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : రక్షాబంధనం.. శ్రావణ మాస పౌర్ణమి రోజున భారతీయులు చేసుకునే అద్భుతమైన పండగ. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమం కోరుతూ.. వారు కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తూ వారి చేతికి రక్షాబంధనం కడతారు. ఆ బంధనం వారి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. అది కట్టిన తర్వాత తమ సోదరులకు ఎలాంటి ఆపద రాకూడదని, వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ అక్కచెల్లెళ్లు ఆకాంక్షిస్తారు. అయితే, కేవలం ఒక్క రాఖీ పండుగ రోజు మాత్రమే కాదు.. జీవితాంతం తమ సోదరులు బాగుండాలన్న ఆకాంక్షతో కొందరు సోదరీమణులు తమ శరీర భాగాలను వారికి దానం చేసిన ఘటనలు కొన్ని ఉన్నాయి. తమ సోదరుడు చావుబతుకుల్లో ఉన్నప్పుడు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, తమ శరీర అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు కొందరు. కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసినవారు కొందరైతే, తమకున్న రెండు మూత్రపిండాల్లో ఒకదాన్ని ఇచ్చేసినవారు మరికొందరు. ఆ స్ఫూర్తిదాయక విషయాల్లో కొన్నింటిని ఇప్పుడు మనం చూద్దాం.
చెల్లి గొప్ప మనసు అన్న ప్రాణం కాపాడింది
రాయదుర్గం ప్రాంతానికి చెందిన వీరభధ్ర (35) వృత్తిరీత్యా వీడియో ఎడిటర్. సాధారణ జీవితాన్ని ఆస్వాధిస్తున్న సమయంలో ఈయనకు కుడివైపు మూత్రపిండం పూర్తిగా పాడైపోయింది. చాలా కాలంగా డయాలసిస్ మీద ఉన్నారు. అయితే, అది కొంతకాలమే. తర్వాత ఎప్పటికైనా ఆ మూత్రపిండాన్ని మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. ఎలా చేయించుకోవాలి.. ఎవరు ఇస్తారని గణేష్ ఆందోళన చెందుతున్న సమయంలో, ఆపద్బాంధవిలా ఆయన చెల్లి గౌతమ్మ (26) ముందుకొచ్చారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆమె తనకున్న రెండు మూత్రపిండాల్లో ఒకదాన్ని తన అన్నకు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. అన్నీ సరిపోవడంతో 2021 సెప్టెంబర్ నెలలో వైద్యులు ఇద్దరికీ శస్త్రచికిత్స చేసి.. మూత్రపిండాన్ని మార్చారు. దాంతో వీరభధ్ర ప్రాణాలు కాపాడినట్లయింది. తోడబుట్టిన అన్న చిన్నప్పటినుంచి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని, అలాంటి అన్న కోసం ఒక మూత్రపిండం ఇవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని గౌతమ్మ చెప్పారు. ఆమె త్యాగ ఫలితంగా ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జీవితాంతం తాము ఒకరికొకరు తోడుగా ఉంటామని వారిద్దరూ అన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఇరువురి ఆరోగ్యం సాధరణంగా ఉండడం మాకెంతో ఆనందంగా ఉందని కిమ్స్ సవీర వైద్యులు నెఫ్రాలజిస్ట్ డా. బదరీనాథ్, యూరాలజిస్ట్ డా. దుర్గాప్రసాద్ లు పేర్కొన్నారు.