గర్భిణీ మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాలి
1 min read– చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : రక్తహీనతతో బాధపడుతున్న మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి వైద్య, విద్యా, స్వచ్ఛ సంకల్పం తదితర అంశాల పై జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ అనీమియాతో బాధపడుతున్న మహిళలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సూచించారు. హై రిస్క్ గర్భవతులను నిర్దేశించిన గడువులోపు ఆసుపత్రిలో చేర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ను త్వరితగతిన గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సేవలందిస్తుందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పిఎంజెఏవై కార్డులను వాలంటీర్లు ద్వారా ఈ-కెవైసి పూర్తి చేయించాలన్నారు. కోవిడ్ ఎక్స్ గ్రేషియాను త్వరితగతిన పెండింగ్ ఉన్న వారికి అందజేయాలన్నారు. అదేవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా స్కూల్ డ్రాప్ ఔట్స్ అయినా విద్యార్థులను విద్యా వాలంటీర్ల ద్వారా తిరిగి పాఠశాలలలో చేర్పించాలన్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు అందించే కోడిగుడ్డు, చిక్కిలను నాణ్యతతో పాటు సరైన సమయంలో అందజేసేలా చూడాలన్నారు. వివిధ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం వల్ల కూడా అనీమియా పారద్రోలే అవకాశం ఉందని అందుకుతగ్గా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి గాను బైజూస్ పరిజ్ఞానంతో కూడిన టాబ్స్ పంపిణీ చేయడం జరిగిందని వాటి ఉపయోగంపై ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలన్నారు. టెస్టిమోనియల్స్ కు సంబంధించి పెండింగ్ ఉన్నవి వాలంటీర్లతో పూర్తి చేయించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా అనీమియా మరియు పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసిడిఎస్ పిడి మరియు జిల్లా వైద్యాధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు కూడా సరైన భోజనంతో అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వసతి గృహాల సంక్షేమ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు స్కూల్ డ్రాప్ ఔట్స్ కాకుండా అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందరం నుండి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.