శ్రీమద్రామాయణము ధార్మిక జీవన మార్గదర్శిని…
1 min read
శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ
శ్రీమద్రామాయణ ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: యుగయుగాలుగా తరతరాలుగా మానవులందరికీ ఆదర్శవంతమైన జీవన మార్గాన్ని ప్రబోధించే అద్భుత కావ్యం శ్రీమద్రామాయణమని, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. కర్నూలు శివారులోని గోదాగోకులం నందు నిర్వహించ బడుతున్న శ్రీమద్రామాయణ మహాయజ్ఞంలో భాగంగా శ్రీమద్రామాయణంలోని విభిన్న అంశములపైన ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామీజీ రామాయణ ప్రవచన మహాయజ్ఞాన్ని ప్రారంభించి, రామాయణ వైశిష్యాన్ని, రామాయణం ద్వారా మనం అభివృద్ధి పరచుకోవలసిన మానవీయ విలువలను తన అనుగ్రహ భాషణం ద్వారా ప్రబోధించారు. మంత్రి టి.జి.భరత్ మాట్లాడుతు దేశ కాల ప్రాంతాలకు అతీతంగా సర్వ మానవాళికి ఆదర్శవంతమైన ధర్మ మార్గ ప్రవర్తకునిగా శోభిల్లిన శ్రీరామచంద్రుని జీవితం వర్తమాన సమాజానికి ఎంతో స్పూర్తిదాయకంగా ఉన్నదని, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోదాగోకులం నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీమద్రామాయణము శ్రీరామ మాతృమూర్తులు అనే అంశంపై డాక్టర్ మధుసూధనాచార్యులు ప్రసంగించారు. శ్రీరామచంద్రమూర్తిని లోకానికి అందించిన కౌసల్య, శ్రీరామ సేవలో తరించిన లక్షణమూర్తిని అందించిన సుమిత్ర, వనవాసానికి వెళ్లమని నిర్దేశించి శ్రీరామ వైభవాన్ని లోకానికి చాటి చెప్పిన కైకేయి అనే ముగ్గురు మాతృమూర్తుల వైభవాన్ని వివరించారు. తదనంతరం శ్రీమద్రామాయణము మిత్ర ధర్మము అనే అంశంపై బి. సర్వజ్ఞ మూర్తి ప్రవచించారు. అన్ని ధర్మాల కన్నా స్నేహ ధర్మం చాలా గొప్పదని అలాంటి స్నేహం యొక్క విలువను చాటిచెప్పిన రామాయణం ఎంతో గొప్ప గ్రంథం అని వివరిస్తూ రామాయణంలోని దశరథుడు- రోమపాదుడు, దశరథుడు- జటాయువు, శ్రీరాముడు- గుహుడు, శ్రీరాముడు- సుగ్రీవుడు, శ్రీరాముడు- విభీషణుడు ఇలా విభిన్న వ్యక్తుల మధ్య ఉన్న స్నేహ ధర్మాన్ని వివరిస్తూ వారి స్నేహం సర్వకాలాలకు ఆదర్శనీయమని ఉద్ఘాటించారు. రామాయణ ప్రవచన యజ్ఞసంధానకర్తగా, సమన్వయకర్తగా డాక్టర్ తొగట సురేశ్ బాబు వ్యవహరించారు. వారు రామాయణ వైశిష్యాన్ని రామనామ స్మరణ ప్రభావాన్ని వివరిస్తూ రామాయణం సర్వదా శ్రేయోదాయక మార్గ నిర్దేశకమని వ్యాఖ్యానించారు. సాయంత్రం మాదినేని మధుసూధన్ శ్రీమద్రామాయణం- గురు ధర్మం అనే అంశంపై, హరిబెల్ సీతామహాలక్ష్మి శ్రీమద్రామాయణం – కార్యసాధకుడి లక్షణం అనే అంశంపై, డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని శ్రీమద్రామాయణం – మానవీయ విలువలు అనేఅంశంపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో ప్రయాగ్రాజ్ నుండి రాఘవ ప్రపన్న జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి శఠగోపముని రామానూజ జీయర్ స్వామీజీ, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, గోదాగోకులం సభ్యులు, వికాస తరంగిణి కేంద్ర సమితి అధ్యక్షులు టి. రమేశ్ గుప్త, పాతాలం సుబ్బారావు, కె.వి.సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, గోదాపరివారం పెరుమాళ్ళ బాలసుధాకర్, వేముల జనార్ధన్, ఇటిక్యాల పుల్లయ్య, భీమిశెట్టి ప్రకాశ్, లింగం రవి, సురేష్, తలుపుల శ్రీనాథ్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం, చిత్రాల వీరయ్య, వేముల పవన్ కుమార్, అనురాధ, లలిత, సునిత, సరితతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.