హోళగుందలో వీధి కుక్కల బెడద…
1 min read
గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు.. ప్రజల్లో ఆందోళన
అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద పట్టణ పరిధిలో వీధి కుక్కల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా రోడ్లపై సంచరిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి సుమారు 9.05 గంటల సమయంలో తీసిన దృశ్యాల్లో ఏకంగా 12కు పైగా వీధి కుక్కలు ఒకేచోట గుంపుగా తిరుగుతున్న పరిస్థితి కనిపించింది.వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. వాహనాల వెంట కుక్కలు పరుగెత్తడం, ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.పట్టణంలోని ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కల సంచారం అధికంగా ఉందని, సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా తగిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా కుక్కలను నియంత్రించడంతో పాటు అవసరమైన వైద్య, కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.


