ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు
1 min read

కౌతాళం మండలం కుంబలనూరు పంచాయతీ సెక్రెటరీని సస్పెండ్ చేయండి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : పెన్షన్ల పంపిణీ, చెత్త సేకరణ తదితర అంశాలపై ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను హెచ్చరించారు. చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించని కౌతాళం మండలం కుంబలనూరు పంచాయతీ సెక్రెటరీని సస్పెండ్ చేయాలని కలెక్టర్ డిపివో ను ఆదేశించారు.కుంబలనూరు గ్రామంలో 90 శాతం మంది చెత్త సేకరించడం లేదని ఫిర్యాదు చేశారని కలెక్టర్ తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పాజిటివ్ పర్సెప్షన్ అంశంపై జడ్పీ సీఈవో, డిఆర్డిఏ పిడి, డిపివో తదితరులతో సమీక్షించారు.పెన్షన్ల పంపిణీ, చెత్త సేకరణ అంశంపై ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. కోసిగి, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, కౌతాళం మండలాల్లో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ లు పంపిణి చేయడం లేదని, పెన్షన్ పంపిణీ లో డబ్బులు తీసుకుంటూ ఉన్నారని, మర్యాదగా మాట్లాడడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జడ్పీ సీఈవో, డి ఆర్ డి ఏ పిడి ని ఆదేశించారు.రెవెన్యూ కు సంబంధించి ఫిర్యాదు లు వచ్చిన ఇద్దరు వీఆర్వోలు, ఏడు మంది విలేజ్ సర్వేయర్లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని పంచాయతీ సెక్రెటరీలను, పెన్షన్ పంపిణీ చేసే అధికారులను హెచ్చరించాలని కలెక్టర్ జిల్లా అధికారుల ఆదేశించారు.సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, డిపిఓ భాస్కర్ , డి ఆర్ డి ఏ పిడి రమణా రెడ్డి, పాల్గొన్నారు.

