NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్యాటీ లివర్‌పై పెరుగుతున్న ముప్పు

1 min read

“Act Now, Screen Today” నినాదంతో ప్రపంచ కాలేయ దినోత్సవం

ముందస్తు పరీక్షలతోనే కాలేయ వ్యాధులకు అడ్డుకట్ట: డాక్టర్ శంకరశర్మ

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకరశర్మ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రపంచ కాలేయ దినోత్సవం థీమ్ “Act Now, Screen Today” అని పేర్కొంటూ, కాలేయ వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 నుంచి 32 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని, భారతదేశంలో ఈ సంఖ్య మరింత పెరుగుతోందని ఆయన తెలిపారు. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి ప్రధాన కారణాలని వివరించారు.ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని, అయితే సమయానికి గుర్తించకపోతే కాలేయ వాపు, ఫైబ్రోసిస్, సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు.ఇటీవలి కాలంలో యువతలో కూడా ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ శంకరశర్మ పేర్కొన్నారు. ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర కలిగిన పానీయాలు, వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే కాలేయ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఫ్యాటీ లివర్‌ను నివారించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, మధుమేహం మరియు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం అవసరమని సూచించారు. అధిక బరువు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్టులు, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ప్రజలు తమ కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, “నేడు పరీక్ష చేయించుకోండి.. రేపటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని డాక్టర్ శంకరశర్మ పిలుపునిచ్చారు.

About Author