మహిళకు అత్యంత అరుదైన థైరాయిడ్ క్యాన్సర్
1 min read
లక్ష మందిలో 3.5 మందికి మాత్రమే వచ్చే వ్యాధి
సరైన సమయానికి కిమ్స్ సవీరాలో విజయవంతంగా చికిత్స
అనంతపురం, న్యూస్ నేడు : అత్యంత అరుదుగా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక మహిళకు సరైన సమయానికి గుర్తించి, దానికి విజయవంతంగా చికిత్స చేయడంతో ఆమె ఊరట పొందారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కిన్నెర హరీష్ కుమార్ వివరించారు. తాడిపత్రి ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల గృహిణికి కుడివైపు మెడ కొద్దిగా వాచినట్లు అనిపించింది. అది క్రమంగా బాగా నొప్పి పుట్టడంతో ఆమె నొప్పి నివారణ మందులు వాడారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో ఎందుకిలా జరుగుతోందో ఆమెకు అర్థం కాలేదు. నిజానికి తనకు పైకి కనిపిస్తున్న లక్షణాల కంటే లోపల పెరుగుతున్న క్యాన్సర్ చాలా ప్రమాదకరమని ఆమెకు తెలియదు. దాంతో అప్పుడు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆమెకు తగిన వైద్య పరీక్షలు చేశారు. ముందుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆ తర్వాత ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ (ఎఫ్ఎన్ఏసీ) పరీక్షలు చేశారు. దాంతో థైరాయిడ్‌లో క్యాన్సర్ వచ్చిందని, అది కుడివైపు మెడలోకి కూడా బాగా విస్తరించిందని తేలింది. ఆమె పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక చికిత్సలు అవసరమని గుర్తించి.. రేడియాలజిస్టులతో కూడా సంప్రదించి సరిగ్గా క్యాన్సర్ ఏయే భాగాల్లో ఉందో గుర్తించాం. ఆ మ్యాపింగ్ అంతా అయిన తర్వాత అత్యంత జాగ్రత్తగా థైరాయిడ్ క్యాన్సర్‌ను పూర్తిగా తొలగిస్తూ అదే సమయంలో ఆమె మెడలో ఉన్న కీలకమైన నిర్మాణాలను యథాతథంగా ఉంచాం. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఆమె తన రోజువారీ పనులన్నింటినీ ఎంచక్కా చేసుకోగలుగుతున్నారు. థైరాయిడ్ క్యాన్సర్ అనేది సాధారణంగా అత్యంత అరుదైనది. ప్రతి లక్ష మందిలో 5.4 మందికే వస్తుంది. అదే మహిళల్లో అయితే లక్ష మందిలో 3.5 మందికే వస్తుంది. కానీ, గత పది పదిహేనేళ్లుగా థైరాయిడ్ క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా మూడు రెట్లు పెరిగాయి. థైరాయిడ్ వాచినప్పుడు గుర్తించడం సులభమే అయినా, చాలామంది రోగులు సమయానికి వైద్యుల వద్దకు వెళ్లరు. అలా వదిలేస్తే ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. మెడ వాచినా, నొప్పి వచ్చినా, గొంతు మారినా, ఊపిరి అందకపోతున్నా ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన వైద్యులను సంప్రదించాలి. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఇలాంటి థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సకు అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో పాటు నిపుణులైన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు అని డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు.

