మతోన్మాద వ్యతిరేక పోరాటమే జార్జిరెడ్డికి నిజమైన నివాళి…
1 min read
కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభ
పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: పట్టణంలో మతోన్మాద వ్యతిరేక పోరాటమే జార్జిరెడ్డికి నిజమైన నివాళి అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ నాయుడు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పట్టణంలో కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్బంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాత ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి అని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సాధారణ విద్యార్థిగా వచ్చి, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలకు ఎదురునిలిచి విద్యార్థులందరికీ అండగా నిలిచిన జార్జిరెడ్డి నేటి విద్యార్థిలోకానికి దిక్సూచి అని అన్నారు. విద్యార్థి ఉద్యమంలో ప్రగతిశీల ఆలోచనలతో, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గళం ఎత్తి, వారితో మమేకమై ఉస్మానియా విశ్వవిద్యాలయ కేంద్రంగా విద్యారంగ సమస్యలపై, విద్యార్థి హక్కులకై, విద్యార్థులపై చేస్తున్న మూకదాడులపై తిరుగుబాటు చేసిన విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి అని, జార్జిరెడ్డి ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాడో వారే నేడు పాలకులుగా మారి దేశంలో అరాచక పాలన చేస్తూ, దేశాన్ని విధ్వంసం చేసే విధంగా సంస్కరణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని విద్యారంగాన్ని విధ్వంసం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానం 2020 ని తీసుకొచ్చారనీ, దేశంలో మోడీషా సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తకే ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి నేడు హామీల అమలు చేయడంలో విఫలం చెందిందని అన్నారు. యువ గళం పాదయాత్రలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అని చెప్పి నేడు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3600 కోట్ల ఫీజులు బకాయిలను విడుదల చేయాలి. తల్లికి వందనం పథకం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నరసింహ రెడ్డి, నాయకులు హాఫిజ్, సూరి,రఘు,గోపాల్,అంజి,వెంకటేష్,లాజారస్ తదితరులు పాల్గొన్నారు.